సాక్షి, చైన్నె : చైన్నె వడపళనిలోని కావేరి హాస్పిటల్ వైద్యులు వైద్య రంగంలోనే అత్యంత అరుదైన, వినూత్న శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. గత ఎనిమిదేళ్లుగా కోలోవాజినల్ ఫిస్టులా సమస్యతో బాధపడుతున్న 73 ఏళ్ల వృద్ధురాలికి గుండెలోని రంధ్రాలను పూడ్చడానికి ఉపయోగించే కార్డియాక్ అక్లూజన్ డివైస్‌ను ఉపయోగించి వైద్యులు శాశ్వత పరిష్కారం చూపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణు లు ఉమ్మడిగా కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం వైద్య చరిత్రలో ఒక రికార్డును నమోదు చేశారు. గతంలో ఆమెకు పెద్దపేగును పక్కకు మళ్లించే కొలోస్టమీ సర్జరీతో పాటు మరికొన్ని ప్రధాన శస్త్రచికిత్స లు వేర్వేరు ఆసుపత్రుల్లో జరిగినప్పటికీ.. అస్సలు సమస్య మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే వచ్చింది. ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నడిపించిన డాక్టర్ టి.కె. ఆనంద్ (సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), ప్రొఫెసర్ పి. మనోకర్ (సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్) మాట్లాడుతూ.. గుండె కోసం తయారు చేసిన పరికరాన్ని మరో అనాటమికల్ భాగంలో అమర్చడం సాంకేతికంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని, అయితే సరైన ప్రణాళిక, సమన్వయంతో రోగికి పునర్జన్మను ప్రసాదించగలిగామని తెలిపారు. కావేరి హాస్పిటల్స్ కో–ఫౌండర్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ.. సంప్రదాయ వైద్య విధానాలు విఫలమైన చోట, వినూత్న ఆలోచనలు , విభాగాల మధ్య సమన్వయం ద్వారా రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నామన్నారు.


