ప్రభుత్వ పాఠశాలల్లోనే
మెరుగైన విద్య
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కలెక్టర్ లీల తెలిపారు. గురువారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభించడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల ఉపాద్యాయులు విద్యార్థులతో పాఠశాలల్లో చేరాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేలూరు చిన్నఅల్లాపురం యూనియన్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉదయం బడిబాట కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేలూరు కొనవట్టంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ లీల పూలమాల వేసి స్వాగతం పలికారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందజేశారు. తోటపాళ్యం ప్రభుత్వ పాఠశాల బాలికలకు టీచర్‌లు కర్పూర హారతి పట్టి స్వాగతం పలికారు. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని రామసానికుప్పం గ్రామంలో విద్యార్థులకు పూలమాలలు వేసి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
అర్ధకేజీ బంగారం చోరీ
తిరువొత్తియూరు: చైన్నె త్యాగరాయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న సుజాత, అదే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజర్. గురువారం ఉదయం ఆమె ఇంటికి తాళం వేసి కార్యాలయానికి వెళ్లారు. ఆమె భర్త గత 4 రోజుల క్రితమే నెల్లూరు వెళ్లారు. సుజాత భర్త తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురై లోపలికి వెళ్లి చూశారు. బీరువా పగులగొట్టి అందులోని అర్ధకిలో బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. పాండి బజార్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.
కారు ఢీకొని మహిళ మృతి
తిరువొత్తియూరు: స్కూల్ టీచర్ నడిపిన కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం ఉదయం రాణిపేట సమీపంలోని కావేరిపాక్కం వద్ద బెంగళూరు నుంచి చైన్నెకి కారు వెళుతోంది. ఈ కారును ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ (సన్మతి–31) నడుపుతోంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీలా (47) మృతిచెందింది. గుణ (55), జ్యోతి (45) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
10 ఐఐటీ కేంద్రాల్లో
500 ఇంధన ఆడిట్‌లు
కొరుక్కుపేట: దేశంలోని 10 ఐఐటీ కేంద్రాల్లో సేవ్ ఎనర్జీ మిషన్‌లో భాగంగా 500 ఇంధన ఆడిట్‌లను అధిగమించిందని కిసెమ్ జాతీయ సహ సమన్వయకర్త ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ కోటక్ బ్యాంకు వారు పర్యావరణ, సుస్థిర అభివృద్ది కార్యక్రమం కింద ఒక సీఎస్‌ఆర్ చొరవగా 2022లో కొటక్ ఇండియా ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు సేవ్ ఎనర్జీ మిషన్ (కిసెమ్) ప్రారంభించారని అన్నారు. ఇప్పటివరకు 30 పారిశ్రామిక రంగాలలో 509కిగా ఎనర్జీ ఆడిట్‌లను పూర్తి చేసిందన్నారు. ఐఐటీ మద్రాసు కేంద్రంగా చేసుకుని 10 ఐఐటీ కేంద్రాల్లో ప్రారంభించిన కార్యకలాపాల్లో కేవలం ఒక సంవత్సరంలోనే కిసిమ్ నెట్‌వర్క్ సమష్టిగా 500లకు పైగా పారిశ్రామిక ఆడిట్‌లను పూర్తి చేసిందని వెల్లడించారు.
విద్యుత్ తీగ తెగి పడి
విద్యార్థి మృతి
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని సోలూరు గ్రామానికి చెందిన కుమరేషన్, మహేశ్వరి దంపతులకు మహేంద్రన్, నరేష్ (16) అనే ఇద్దరు కుమారులున్నారు. నరేష్ పెరి యాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్–2 వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూమిలో పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం పశువును ఇంటికి తీసుకెళుతున్నాడు. ఆ సమయంలో పెను గాలులతో కూడిన వర్షాలు కురిసింది. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. నరేష్ పట్టుకొస్తున్న పశువు విద్యుత్ తీగను తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నరేష్‌కు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
కుమార్తె ఇంటిపై పెట్రోల్
బాంబు విసిరిన తండ్రి అరెస్ట్
తిరువొత్తియూరు: నైల్లె జిల్లా మూలైక్కరైపట్టి సమీపంలోని కరుణై గ్రామానికి చెందిన ముత్తుకుమార్ (22), అదే గ్రామానికి చెందిన వంట మాస్టర్ మురుగన్ కుమార్తె విద్య (20) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను తండ్రి మురుగన్ వ్యతిరేకించాడు. గత నెల 20న విద్య, ముత్తుకుమార్ పెద్దలకు తెలియకుంఆ వివాహం చేసుకుని కరుణై గ్రామంలోని ముత్తుకుమార్ ఇంట్లో ఉంటు న్నారు. బుధవారం రాత్రి ఈ దంపతులు తమ కొత్త ఇంటి నిర్మాణ పనులను చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఉన్న విద్య తండ్రి మురుగన్, ముత్తుకుమార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మరింత కోపానికి గురైన ఆయన, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి తలుపులను ఇష్టానుసారంగా నరికాడు. అనంతరం ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టి, లోపలికి పెట్రోల్ బాంబు విసిరాడు. దీంతో ఇల్లు తగలబడడం ప్రారంభమైంది. చుట్టుపక్కల వారు వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. మురుగన్‌ను స్థానికులు పట్టుకుని మూలైక్కరైపట్టి పోలీసులకు అప్పగించారు.


