అన్నామలై రాజీనామా లేఖ నాకు రాలేదు | - | Sakshi
Sakshi News home page

అన్నామలై రాజీనామా లేఖ నాకు రాలేదు

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌

సాక్షి, చైన్నె: బీజేపీలో తీవ్ర సంచలనం రేపుతున్న అన్నామలై పార్టీ వ్యవహారంపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ స్పందించారు. అన్నామలై బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాంటి రాజీనామా లేఖ తనకు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నైనార్‌ నాగేంద్రన్‌ గురువారం తిరునెల్వేలిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పార్టీ అంతర్గత పరిణామాలు , ప్రస్తుత టీవీకే ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియతమ సోదరుడు అన్నామలైకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని, ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఎవరితోనూ చెప్పలేదన్నారు. తాము కూడా ఆయనతో దీనిపై చర్చించలేదన్నారు. సాధారణంగా ఎప్పటిలాగే పార్టీ విషయాలపై మాట్లాడుకుంటున్నామని, . చిన్న విషయాన్ని కూడా మీడియానే పెద్దదిగా చూపిస్తోందన్నారు. రాజీనామా అంశంపై రెండు రోజుల్లో మాట్లాడతానని అన్నామలై అనడం గురించి ప్రశ్నించగా.. ఆ ప్రశ్నను ఆయననే అడగాలని బదులిచ్చారు. ఎన్నికల సమయంలో అన్నామలై హెలికాప్టర్‌ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

పదువుల గురించి తెలియదు

తాను ఢిల్లీ వెళ్లి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిని కలిసి వచ్చానని, అయితే కేంద్ర మంత్రి పదవి గురించి తనకెలాంటి సమాచారం రాలేదని, కేవలం మీడియాలోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా అన్నామలై గురువారం మీడియా ముందుకు వస్తారని సర్వత్రా భావించారు. ఇందుకు కారణం ఆయన బర్త్‌డే రోజుకావడమే. అయితే, ఆయన ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. పీఎం మోదీతో ఆయన భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

వారికీ..వీరికీ తేడా లేదు

డీఎంకే ప్రభుత్వానికి, టీవీకే ప్రభుత్వానికి తేడా లేదని, గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని నాగేంద్రన్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మద్యం బాటిల్‌పై 10 రూపాయల అదనపు వసూళ్ల గురించి మాట్లాడిన విజయ్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా టాస్మాక్‌ దుకాణాలలో అదే మామూళ్ల పర్వం కొనసాగుతోందని విమర్శించారు. చైన్నె అన్నాసాలైలోని విద్యుత్‌ బోర్డు ప్రధాన కార్యాలయం నుండి హార్డ్‌ డిస్క్‌లు మాయమవడం, టెండర్లలో రూ.400 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఇప్పుడు అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ ఎంపీ స్థానాన్ని టీవీకే పార్టీ కాంగ్రెస్‌కు కేటాయించడంపై నాగేంద్రన్‌ తీవ్రంగా స్పందించారు. టీవీకే పార్టీ పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీకి ఒక బినామీలా వ్యవహరిస్తోందన్నారు. సీఎం విజయ్‌ ప్రమాణ స్వీకార ఉత్సవంలోనూ, మంత్రుల గ్రూప్‌ ఫొటోలోనూ రాహుల్‌ గాంధీ స్పష్టంగా కనిపించారని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఇది మరో రూపం అని స్పష్టమవుతోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement