తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంత్రి గాంధీరాజన్ గురువారం సాయంత్రం స్వామి దర్శనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరించారు. ఆపార్టీ అభ్యర్థిగా అరక్కోణం నుంచి గెలుపొందిన గాంధీరాజన్ సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో గురువారం మంత్రి గాంధీరాజన్ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబసమేతంగా మురుగన్ దర్శనానికి విచ్చేవారు. మంత్రికి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో అధికారులు స్వాగతం పలికారు. ముందుగా వినాయకుడు, షణ్ముఖర్, మూలవర్లు., వళ్లి దేవసేనలను దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవర్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ప్రసాదాలను అందజేశారు.
వృద్ధురాలి నుంచి నగలు
అపహరించిన బీజేపీ కార్యకర్త
తిరువొత్తియూరు: కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపం పాత నెల్లికుప్పానికి చెందిన జయరామన్ భార్య సరసు (80). గత 29వ తేదీ రాత్రి బస్టాండ్ సమీపంలోని దుకాణంలో ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కుని నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆమెను ఇంటి దగ్గర దించుతానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమె నగలను లాక్కని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నెల్లికుప్పం వాలజపట్టు మెయిన్ రోడ్డుకు చెందిన గోవిందరాజ్ కుమారుడు అరుణ్‌మొళిదేవన్ (35) అని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో అతడు బీజేపీ కార్యకర్త అని తేలింది.
ప్రభుత్వ టీచర్ హత్య
కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి ఇలంగోవన్‌పై దాడి, హత్యా సంఘటన విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. విల్లుపురం జిల్లాలోని వలదతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మకుళం గ్రామానికి చెందిన ఇలంగోవన్, మెల్లక్కూర్ ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాలలో సైనన్స్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య విడిపోవడంతో, ఇలంగోవన్ తన తల్లి రాజమ్మల్‌తో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను బోధనతో పాటు, పాత ఇనుప వస్తువులను కొని అమ్మి, వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ఈలోగా, రాజమ్మల్ గత వారం చైన్నెలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఇలంగోవన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పక్క గ్రామంలో నివసించే అతని తల్లి, సోదరి తమ సెల్ ఫోన్ల ద్వారా అతనికి చాలాసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అతను ఫోన్ ఎత్తలేదు.తల్లికి అనుమానం రావడంతో, ఆమె అక్క కూతురును ఇలంగోవన్ ఇంటికి పంపింది. ఆ సమయంలో, ఇంటి ఒక వైపు తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది, అటు నుండి వస్తున్న దుర్వాసన చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఆమె వెంటనే తన బంధువులకు విషయం చెప్పింది. అక్కడికి వచ్చిన బంధువులు వెనుక వైపు తెరిచి ఉన్న తలుపు గుండా ఇంట్లోకి ప్రవేశించగా, ఒక చిన్న గదిలో సోఫాపై వికృతంగా, కుళ్లిపోయిన స్థితిలో ఇలంగోవన్ మృతదేహం పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైంది. పోలీసులు ఇలంగోవన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


