తిరువళ్లూరు: వేసవి సెలవులు ముగిసిన క్రమంలో జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు గురువారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత కారణంగా పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వచ్చిన వినతుల్లో భాగంగా జూన్ 4 నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాల పునఃప్రారంభం రోజున పుస్తకాలు, యూనిఫాం అందించాలని ఆదేశించిన క్రమంలో జిల్లా కేంద్రాలకు తరలించిన పుస్తకాలను పాఠశాలలకు చేరవేశారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా గురువారం యథావిధిగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థుల రాకతో సందడి నెలకొంది. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు, మొక్కలు, చాక్లెట్లు ఇచ్చి ఆహ్వానించారు. తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.6కోట్లతో నిర్మించిన పాఠశాలలో టీచర్లు మైక్రోమైక్ ద్వారా పాఠాలను బోధించారు. వెళ్లియూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కవిత తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
పళ్లిపట్టు: వేసవి సెలవుల తరువాత గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి చేరుకున్నారు. తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సహా విద్యా సామగ్రిని ఉపాధ్యాయులు అందజేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు ఇచ్చి స్వాగతం పలికారు. తొలిరోజే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగు, పాదరక్షలు, యూనిపాం అందజేశారు. ఆర్కేపేట యూనియన్‌లోని ఎస్‌వీజీ.పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. మండల విద్యాశాఖ అధికారులు మోహన్, అరసు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.


