– సీనియర్‌లకు రెండేసి జిల్లాలు
సాక్షి, చైన్నె:తమిళనాడులో జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం జాబితాను సీఎం విజయ్ బుధవారం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు వీలుగా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 38 జిల్లాలో పది జిల్లాలో టీవీకేకు ఒక్కరంటై ఒక్క ఎమ్మెల్యేలు లేరు. 34 మందిమంత్రులలో పలువురు సీనియర్ మంత్రులకు రెండేసి జిల్లాలను అప్పగించారు. మంత్రి ఆనంద్‌కు విల్లుపురం, కడలూరు, ఆధవ్ అర్జునకు చైన్నె, తిరువణ్ణామలై, వెంకటరమణన్‌కు మైలాడుతురై, కుమార్‌కు తిరువళ్లూరు, మరియ విల్సన్‌కు తిరునల్వేలి, తెన్నరసుకు కాంచీపురం, రాజ్ మోహన్‌కు పెరంబలూరు, శరత్‌కుమార్‌కు చెంగల్పట్టు, రంజిత్‌కుమార్‌కు తిరుపత్తూరు, వీసీకే వన్నియరసుకు కళ్లకురిచ్చి, గాంధి రాజ్‌కు రాణి పేట, రాజ్‌కుమార్‌కు ధర్మపురి, అరియలూరు జిల్లాలను కేటాయించారు. ఐయూఎంఎల్ షాజహాన్‌కు నాగపట్నం, వినోద్‌కు తంజావూరు, విజయలక్ష్మికి కరూర్, లోకేష్‌కు నామక్కల్, అరుణ్ రాజ్‌కు తిరుప్పూర్, కమలికి నీలగిరి, విజయ్ బాలాజీకి వేలూరు, సెంగోట్టయ్యన్‌కు ఈరోడ్, సంపత్‌కుమార్‌కు కోయంబత్తూరు, మదురై, తేనిలు నిర్మల్‌కుమార్‌కు, పుదుకోట్టై మహ్మద్ పర్వేజ్‌కు అప్పగించారు. అలాగే, శివగంగై – ప్రభు, కృష్ణగిరి– కీర్తన, విరుదునగర్ – జగదీశ్వరి, తిరువారూర్ – విశ్వనాథన్(కాంగ్రెస్), తూత్తుకుడి – శ్రీనాథ్, రామనాథపురం – మదన్ రాజా, సేలం – విజయ్ తమిళన్ పార్తీబన్, కన్యాకుమారి– రాజేష్‌కుమార్(కాంగ్రెస్), తెన్కాసీ – రాజీవ్, దిండుగల్– విఘ్నేష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
నేటి నుంచి విద్యార్థుల బడిబాట
– యూనిఫాం, పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి,చైన్నె: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలో గురువారం పాఠశాలల గేట్లు తెరచుకోన్నాయి. ఇప్పటికే పాఠశాలలో అన్ని రకాల పనులను ముగించిన విద్యాశాఖ అధికారులు ఈ మేరకు సర్వం సిద్ధంచేశారు. విద్యార్థులకు తొలి రోజు నుంచే యూనీఫాం, పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వివరాలు.. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి భానుడు తీవ్ర ప్రభావాన్ని చూపించారు. మార్చిలో ప్లస్ టూ, ప్లస్‌ఒన్ పరీక్షలు, ఏప్రిల్ మొదటి వారంలో పది పబ్లిక్ పరీక్షలు ముగించారు. ఈ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, అధికార మార్పు జరగడం చోటు చేసుకున్నాయి. అలాగే ఓవైపు భానుడి భగ.. భగతో జూన్ 1న తెరుచుకోవాల్సిన బడులు మూడు రోజులు వాయిదా వేశారు. ప్లస్‌టూ, పది ఫలితాలన్నీ విడుదలయ్యాయి. ఉన్నత విద్యాకోర్సుల దరఖాస్తుల పర్వం శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ఊపందుకుంది. ఈ పరిస్థితులలో 2026–27 విద్యా సంవత్సరం గురువారం ప్రారంభంకానుంది. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలోని 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనున్నారు. కాగా విద్యార్థులను ఆహ్వానించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వీసీకే 2026 అవార్డుల జాబితా విడుదల
సాక్షి, చైన్నె: 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక వీసీకే పురస్కారాల గ్రహీతల జాబితాను ఆ పార్టీ అధినేత తిరుమావళవన్ బుధవారం విడుదల చేశారు. సమాజం, రాజకీయం, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి వివిధ రంగాలలో దేశ, రాష్ట్ర స్థాయిలలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా ఈ అవార్డులను అందించి గౌరవిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. సామాజిక విప్లవకారులు, మహనీయుల స్మారకంగా 2007 నుండి ఏటా వీసీకే ఆధ్వర్యంలో.. అంబేడ్కర్ సుడర్, పెరియార్ ఒలి, కామరాజర్ కదిర్, అయోథిదాసర్ ఆదవన్, కాయిదేమిల్లత్ పిరై, సెమ్మొళి అవార్డులను ప్రధానం చేస్తున్నారు. అలాగే 2022 సంవత్సరం నుండి అదనంగా ’మార్క్స్ మామణి’ అవార్డును కూడా చేర్చారు.
అవార్డులకు ఎంపికై ంది వీరే..
ఈ ఏడాది 2026 వీసీకే అవార్డుల విజేతలుగా అంబేడ్కర్ సుడర్ అవార్డు– కె. చొక్కలింగం (మనోన్మణీయం సుందరనార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్), పెరియార్ ఒలి అవార్డు– హెన్రీ తిఫాగ్ నె (మానవ హక్కుల పోరాట యోధుడు), మార్క్స్ మామణి అవార్డు– వీరపాండియన్ (సిపిఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి), కామరాజర్ కదిర్ అవార్డు– బాల ప్రజాపతి అడిగళార్, అయోథిదాసర్ ఆదవన్ అవార్డు: రూత్ మనోరమ (సామాజిక కార్యకర్త), కాయిదేమిల్లత్ పిరై అవార్డు: ముహమ్మద్ మునీర్(ఐఎన్‌టీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు), సెమ్మొళి అవార్డు: వేల్ స్వామి (ప్రముఖ తమిళ పండితుడు) ఎంపికయ్యారు. ఈ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకను జూలై 5వ తేదీన చైన్నె తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరుగుతుందని ప్రకటించారు.


