సాక్షి, చైన్నె: మహిళలు, పిల్లలపై నేరాల అదుపునకు పటిష్ట చర్యలు తీసుకుంటానని తమిళనాడు కొత్త డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. తమిళనాడు శాంతిభద్రతల డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను అరికట్టడంతో పాటు మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కీలక అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.దీంతో తొమ్మిది నెలల అనంతరం పూర్తి స్థాయి లో శాంతి భద్రతల విభాగం డీజీపీ నియామకానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకు యూపీఎస్సీ సిఫారసుల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ కుమార్ అగర్వాల్‌ను తమిళనాడు శాంతిభద్రతల డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జైళ్ల శాఖకు సందీప్ రాయ్ రాథోడ్
తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అప్పటివరకు ఉన్న ఇన్‌చార్జ్ డీజీపీ వెంకట్రామన్‌ను బదిలీ చేసి,ఆయన స్థానంలో సందీప్ రాయ్ రాథోడ్‌ను డీజీపీగా ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆయనను బదిలీ చేశారు. సందీప్ రాయ్ రాథోడ్‌ను జైళ్ల శాఖ డీజీపీగా నియమించారు. ఇది వరకు జైళ్ల శాఖ అదనపు డీజీపీగా ఉన్న శంకర్‌ను అత్యంత కీలకమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఏడీజీపీగా పంపించారు.
బాధ్యతల స్వీకరణ
బుధవారం మెరీనా తీరంలోని హెడ్ క్వార్టర్స్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ అగర్వాల్‌కు పలువురు ఉన్నతాధికారులు పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేష్ కుమార్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం విజయ్‌కు, తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కు, నేరాల నియంత్రణకు ప్రజలందరూ తమిళనాడు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరా రు. పటిష్ట చర్యలతో ముందుకెళ్తామని, నేరగాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న డీజీపీ సీఎం విజయ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.


