వైగై, పెరియార్‌ డ్యాంలో జలకళ | - | Sakshi
Sakshi News home page

వైగై, పెరియార్‌ డ్యాంలో జలకళ

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

● నేడు తొలకరి పలకరింపునకు అవకాశం

సాక్షి, చైన్నె : గత కొన్ని నెలలుగా తీవ్ర అనావృష్టితో ఎండిపోయిన వైగై, పెరియార్‌ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఎట్టకేలకు వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో డ్యామ్‌లకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామం నీటి ఎద్దడితో అల్లాడుతున్న తమిళనాడులోని ఐదు జిల్లాల ప్రజలకు, రైతులకు తీవ్ర ఊరటను ఇస్తోంది. అదే సమయంలో నైరుతీ రుతు పవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉండటంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వైగై నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇన్‌–ఫ్లో పూర్తిగా పడిపోయింది. మరోవైపు తాగునీరు, సాగునీటి అవసరాల కోసం నిరంతరం నీటిని విడుదల చేయడంతో జలాశయంలో నీటిమట్టం అడుగంటింది. మే 20 నుండి మే 29 వరకు డ్యామ్‌కు నీటి రాక పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల 6,091 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం గల వైగై డ్యామ్‌లో, మే 29 నాటికి కేవలం 111 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నీరు మాత్రమే మిగిలింది.

క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం

పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మే 30 నుండి జలాశయాల్లోకి మళ్లీ నీరు రావడం ప్రారంభమైంది. మొదట్లో సెకనుకు 96 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం.. క్రమంగా పెరుగుతూ బుధవారం నాటికి 116 క్యూసెక్కులకు చేరింది. దీంతో వైగై డ్యామ్‌ నీటి మట్టం 21.75 అడుగులకు (మొత్తం ఎత్తు 71 అడుగులు) పెరిగింది. తేక్కడి పరిసరాలలో 29.4 మి.మీ, పెరియార్‌ డ్యామ్‌ పరిసరాలలో 19.2 మి.మీ, వైగై డ్యామ్‌ పరిసరాలో 13.2 మి.మీ, మంజళారు డ్యామ్‌ 4 మి.మీ వర్షం గడిచిన 24 గంటలలో పడింది.

నైరుతి రుతుపవనాలపైనే ఆశలు

ఈ వర్ష సూచనలపై జల వనరుల శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. కేరళలో గురువారం రుతుపవనాలు ప్రవేశిస్తుండడంతో, పెరియార్‌ డ్యామ్‌కు నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలోని పశ్చిమ కనుమల వెంబడి మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చే శారు. రాబోయే రోజుల్లో జలాశయాల నీటి మట్టం వేగంగా పెరుగుతుందన్నారు. పరివాహక ప్రాంతాలను కేంద్రీకరించి కురుస్తున్న ఈ వర్షాల వల్ల నీటి ఇన్‌–ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో దక్షిణ తమిళనాడులోని ఐదు జిల్లాల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. రుతు పవనాలు క్రమంగా విస్తరించిన పక్షంలో పశ్చిమ కనుమలలోని నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్‌లలోనూ భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయి.

వైగై డ్యాం

Advertisement
 
Advertisement
Advertisement