సాక్షి, చైన్నె : భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ సూపర్ పవర్‌గా మార్చాలనే లక్ష్యంలో తమిళనాడు తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర క్రీడా మంత్రి ఆధవ్ అర్జున తెలిపారు. 2029 జాతీయ క్రీడల ఆతిథ్యానికి తమ రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. బుధవారం ఢిల్లీలో క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసిన ఆధవ్ అర్జునా.. రాష్ట్రంలో క్రీడల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరుతూ ఒక వివరణాత్మక వినతిపత్రాన్ని) సమర్పించారు. వీటిని ఆమోదించాలని కోరారు. నిధులతో పాటుగా అనుమతుల మందజూరు విషయంగా చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడు క్రీడాశాఖ కార్యదర్శి సజ్జన్‌సింగ్ ఆర్. చవాన్ , ఎస్‌డీఏటీ మెంబర్ సెక్రటరీ జె. మేఘనాథ రెడ్డి పాల్గొన్నారు.


