సాక్షి, చైన్నె: వైద్య రంగంలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను చైన్నె అడయార్‌లోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు. ఒకే సమయంలో తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ బారిన పడిన 76 ఏళ్ల వృద్ధురాలికి అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ (శరీరంపై పెద్దగా కోతలు లేని చిన్న రంధ్రం ద్వారా చేసే ప్రక్రియ) పద్ధతిలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తికేయన్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ నేతృత్వంలోని బృందం బుధవారం ఈ శస్త్ర చికిత్స విజయవంతం గురించి స్థానికంగా వివరించారు. హైపర్‌టెన్షన్ (రక్తపోటు), మధుమేహం (డయాబెటిస్) ఉన్న సదరు మహిళకు మెదడులోని మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ప్రాంతంలో, అలాగే మెడలోని కరోటిడ్ ఆర్టరీలో తీవ్రమైన బ్లాక్‌లు ఏర్పడి స్ట్రోక్ వచ్చిందన్నారు. అదే సమయంలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కూడా తీవ్రమైన బ్లాక్‌లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి కావడంతో వేర్వేరు విభాగాల వైద్యులు ఒకే బృందంగా ఏర్పడి రంగంలోకి దిగారు. ఒకే సిట్టింగ్‌లో మూడు క్లిష్టమైన ప్రొసీజర్లతో మల్టీడిసిప్లినరీ వైద్య బృందం ఈ అసాధారణ చికిత్సను విజయవంతంగా నిర్వహించిందని వివరించారు. మొదట మెదడు లోపల తీవ్రంగా కుంచించుకుపోయిన ధమనిని తెరిచేందుకు అత్యంత అధునాతన స్టెంటింగ్ ప్రక్రియతో మెడ భాగంలో ఉన్న తీవ్రమైన బ్లాక్‌ను తొలగించడానికి ఈ చికిత్స చేశామన్నారు. కరోనరీ యాంజియోప్లాస్టీతో మెదడు ప్రొసీజర్లు ముగిసిన వెంటనే గుండెకు రక్తప్రసరణను పునరుద్ధరించడానికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేశామన్నారు.


