తిరువళ్లూరు: కాకలూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ బుధవారం ఉదయం తొలగించారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని డీఎంకే నేత కట్టడాలను నిర్మించాడు. అనంతరం సంబంధిత కట్టడాలను అద్దెకు ఇచ్చినట్టు కలెక్టర్ కవితకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని పంచాయతీరాజ్‌శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగానే అధికారులు బుధవారం ఉదయం సంబంధిత ప్రాంతంలో సర్వే నిర్వహించారు. సర్వేలో ఆక్రమణలు వున్నట్టు గుర్తించారు. వెంటనే అధికారులు వాటిని జేసీబీ యంత్రం ద్వారా తొలగించడానికి యత్నించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన డీఎంకే యూనియన్ కార్యదర్శి జయశీలన్, కౌన్సిలర్ పూవన్నన్ అధికారులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి డీఎంకే నేతలను పక్కకు తప్పించి ఆక్రమణలు తొలగించారు. ఈ సంఘటనతో గంట పాటు కాకలూరులో ఉద్రిక్తత నెలకొంది. సీఐ విజయకుమార్, ఎస్‌ఐ గోపికృష్ణన్, బీడీఓ, ఇళంగోవన్, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని పూర్తిచేశారు.


