కార్పొరేటర్ల సవాల్
సాక్షి, చైన్నె: ఆస్తిపన్ను అవినీతిలో మదురై కార్పొరేషన్ కార్పొరేటర్లు రూ.2,000 కోట్లు సంపాదించారని ఆరోపించిన న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్‌కు కౌన్సిల్ మీట్‌ల్లో కార్పొరేటర్లు సవాల్ విసిరారు. తాము అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తమను ఉరితీయండి.. 3 నెలల్లో ఆరోపణలను నిరూపించాలి. లేనిపక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని బుధవారం మదురై కార్పొరేషన్ సమావేశంలో డీఎంకే కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. మదురై కార్పొరేషనల్‌లోని 100 మంది కౌన్సిలర్లు తలా రూ.10 కోట్ల నుండి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.2,000 కోట్ల వరకు ఆస్తిపన్ను అక్రమాల ద్వారా వెనకేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మదురై కార్పొరేషన్ సమావేశంలో డీఎంకే కౌన్సిలర్ల పెద్దఎత్తున నిరసన చేపట్టారు.డీఎంకే కార్పొరేటర్ జయరామన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీసీకే, కమ్యూనిస్టులు టీవీకే వైపుగా వెళ్లి పోయారని, కాంగ్రెస్ కూడా చెప్పకుండా వెళ్లిపోయి ద్రోహం చేసిందన్నారు. ప్రస్తుతం మదురై కార్పొరేషన్‌లో డీఎంకే ఒంటరిగా గానే ఉందని, ప్రభుత్వ అధికారాలు కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వ వేదికలపై ఏం మాట్లాడాలో కూడా మంత్రికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడున్న టీవీకే ఎమ్మెల్యేలు వెళ్లి ఈ విషయాన్ని మంత్రికి చెప్పండని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కార్పొరేటర్లు అందరూ లేచి నిలబడి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్పొరేషన్ హాల్‌లో పొలిటికల్ హీట్
ఈ రసాభాసపై వివిధ పార్టీల నేతలు భిన్నంగా స్పందించారు టీవీకే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్తికేయన్ మాట్లాడుతూ.. తాము ఎలా మాట్లాడాలో డీఎంకే కార్పొరేటర్లు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతా వాస్తవాలు కాబట్టే , ఇక్కడి మేయర్, జోనల్ లీడర్లు రాజీనామా చేశారని, మేయర్ ఇంద్రాణి భర్త పొన్ వసంత్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో? చాలామంది అధికారులను ఎందుకు సస్పెండ్ చేశారో? అని ప్రశ్నించారు. మరో టీవీకే ఎమ్మెల్యే కల్లాణై మాట్లాడుతూ.. ఈ ఆస్తిపన్ను అవినీతిని తాము వదిలిపెట్టబోమని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడి నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు. అన్నాడీఎంకే కార్పొరేషన్ ప్రతిపక్ష నేత సోలైరాజా మాట్లాడుతూ.. తామే ఈ ఆస్తి పన్ను అవినీతిని బయటకు తెచ్చామని, కోర్టులో కేసులు వేసి పోరాటాలు చేశామని, తాము అవినీతి చేశామని ఎవరూ అనలేరని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ నాగరాజన్ మాట్లాడుతూ.. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే డీఎంకే, టీవీకే నేతలు బయటకు వెళ్లి మాట్లాడుకోవాలన్నారు. అయితే, మంత్రి నిర్మల్ కుమార్ కౌన్సిలర్లందరినీ ఒకేలా జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదన్నారు. అధికారులు, కౌన్సిలర్లు ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించకూడదని, సరైన ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని టీవీకే ఎమ్మెల్యేలు తమ మంత్రికి చెప్పాలని హితవు పలికారు.


