ఎప్పుడైనా గవర్నర్‌ను కలవచ్చు | - | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా గవర్నర్‌ను కలవచ్చు

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

● కేబినెట్‌ విస్తరణపై రంగస్వామి వ్యాఖ్య

సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న సంకేతాల గురించి సీఎం ఎన్‌. రంగస్వామి బుధవారం స్పందించారు. కేబినెట్‌ విస్తరణకు సంబంధించి తాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఎప్పుడైనా కలవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్రపక్షమైన బీజేపీ నుండి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన తేల్చి చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం. కరుణానిధి జయంతి వేడుకలను బుధవారం పుదుచ్చేరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రంగస్వామి.. మేరీ హాల్‌లో అలంకరించి ఉంచిన కరుణానిధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక స్పీకర్‌ అన్బళగన్‌, పలువురు ఎమ్మెల్యేలు, డీఎంకే ప్రతినిధులు పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రేపే మంత్రివర్గ విస్తరణ?

పుదుచ్చేరిలో గురువారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా.. మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని సీఎం రంగస్వామి క్లుప్తంగా సమాధానమిచ్చారు. ఈ విషయమై గవర్నర్‌ను ఎప్పుడు కలుస్తారు అని అడగ్గా.. గవర్నర్‌ను ఎప్పుడైనా కలవవచ్చు, దానికి సమయంతో పనేముందన్నారు

బీజేపీ ఒత్తిడి ఉందా?

మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూటమి భాగస్వామి అయిన బీజేపీ ఏమైనా ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. బీజేపీ ఎప్పుడూ, ఎలాంటి ఒత్తిడి తమపై తీసుకురాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎం మాట్లాడుతూ.. ‘షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలా వద్దా అనే అంశంపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement