సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి చైన్నె హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఆయన తన ఆస్తులు, ఆదాయ వివరాలను దాచారంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పళనిస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే, ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని, దీనిపై ఆదాయపన్ను శాఖ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు శక్తివేల్ పెరుమాళ్ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పిటిషనర్ వాదన
పిటిషనర్ తన పిటిషన్లో పళనిస్వామి తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని వివరించారు. 2021, 2026 ఎన్నికల అఫిడవిట్లను నిశితంగా పరిశీలిస్తే ఆస్తుల వివరాల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజాలను ఉద్దేశపూర్వకంగానే దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ సమగ్ర విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
హైకోర్టు తీర్పు
ఈ పిటిషన్ చైన్నె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో ఇలాంటి వ్యవహారాలపై కోర్టులు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాయని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేనిదని పేర్కొన్నారు. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఉంటే ఎన్నికల పిటిషన్ మాత్రమే దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ఐటీ శాఖ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా దాఖలైన ఈ వ్యాజ్యాన్ని పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


