అధికారులతో సమాలోచన
ప్రత్యామ్నాయాలపై దృష్టి
ప్రత్యేక ప్యాకేజీల ప్రకటన
అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రిసార్టులు, టీ దుకాణాలకు ఎదురైన కష్టాల గురించి తెలిసిందే. హోటళ్ల మూతతో కాయగూరల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఒక్క చైన్నె కోయంబేడులోనే రోజుకు 2 వేల టన్నుల వరకు కాయగూరలు పేరుకు పోతున్నాయి. గ్యాస్ ఆధారిత ఎంఎస్‌ఎంఈలకు సైతం కష్టాలు ఎదురై ఉన్నాయి. కేవలం గ్యాస్ కారణంగా అనేక రంగాలు ఇబ్బందులు పడుతుండటాన్ని పరిగణించిన సీఎం స్టాలిన్ సచివాలయంలో ఉదయం అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో వివిధ శాఖ ప్రధాన కార్యర్థులు పాల్గొన్నారు. గంటన్నరకు పైగా జరిగిన సమావేశానంతరం సీఎం స్టాలిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏవీజీసీ – ఎక్స్ ఆర్ పాలసీ
అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు నూతన ఏవీజీసీ – ఎక్స్ ఆర్ పాలసీ 2026 ను సీఎం స్టాలిన్ విడుదలచేశారు. రాష్ట్ర సమాచార సాంకేతిక, డిజిటల్ సేవల శాఖ రూపొందించిన ‘తమిళనాడు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ , ఎక్సెండెడ్ రియాలిటీని రూపకల్పన చేశారు. ఈ పాలసీలోని ముఖ్య అంశాలను ప్రకటించారు. తమిళనాడును ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో భాగంగా, ఏవీజీసీ అండ్ ఎక్స్ ఆర్ మార్కెట్‌లో 20 శాతం వాట సాధించేందుకు నిర్ణయించారు. 2,030 నాటికి ఈ రంగంలో 2 లక్షల మందికి ఉన్నత స్థాయి నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించండం, చైన్నెలో ప్రధాన కేంద్రంతో పాటూ కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, సేలం , తిరునల్వేలి వంటి నగరాల్లో ఎల్‌కాట్ – వియన్ సెంటర్లు, ఉప కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించారు. సుమారు 300 నుండి 400 కళాశాలల్లో ‘నాన్ మొదల్వన్‘ పథకం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించనున్నారు. స్టార్టప్ రంగంలోని కొత్త కంపెనీలకు నిధులు, మార్గదర్శకత్వం అందించడానికి ఎల్‌కాట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ కళాశాలలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం సంబంధించిన ఉత్తర్వులను సీఎం జారీ చేశారు. ఐదుగురికి నియామక ఉత్తర్వులను అందజేశారు.
కాలుష్య నియంత్రణకు మినహాయింపు
ఎల్‌పీసీ, సీఎన్‌జీ గ్యాస్ వాడే వాడే పరిశ్రమలు ప్రత్యామ్నాయంగా కిరోసిన్, బయోమాస్ వంటి ఇంధనాలను వాడుకోవడానికి అనుమతి నిచ్చారు. దీని కోసం కాలుష్య నియంత్రణ మండలి నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా చేశారు. అయితే, సమాచారం ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనం దృష్ట్యా, అదనంగా ఉండే పాలను ఎటువంటి ఆంక్షలు లేకుండా ’ఆవిన్’ సహకార సంఘాల ద్వారా సేకరించాలని ఆదేశించారు. గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడితే కూరగాయల విక్రయాలు దెబ్బతినకుండా ఉండేందుకు, రైతులు తమ ఉత్పత్తులను 194 ఉలవర్ సంతై (రైతు బజార్ల) లో ఎటువంటి ఆంక్షలు లేకుండా విక్రయించుకోవచ్చు అని వివరించారు. రేషన్ కార్డుదారుల కోసం ఈ నెలలో అదనంగా 3228 కిలో లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో , జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ మీడియాతోమాట్లాడుతూ ఆస్పత్రులకు గ్యాస్ కొరత అన్నది రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని ప్రకటించారు.
‘గ్యాస్’ ఇక్కట్లపై
సీఎం స్టాలిన్ సమీక్ష
ప్రధాన నిర్ణయాలతో ఉపశమన చర్యలు
గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో సీఎం స్టాలిన్ కీలక నిర్ణయాలతో ప్యాకేజీలను ప్రకటించారు. ఈ మేరకు విద్యుత్ సబ్సిడీగా హోటళ్లు, టీ కొట్లు , క్లౌడ్ కిచెన్ లు, గ్యాస్ స్టవ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడితే, అదనంగా వినియోగించే విద్యుత్తుపై యూనిట్‌కు రూ. 2 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నంత వరకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఎంఎస్‌ఎంఈ రంగంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక అవకాశం కల్పించారు. ఈ మేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వివిధ పథకాల కింద 23 నుంచి 35 శాతం వరకు సబ్సిడీతో కూడిన రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ప్రకటించారు.


