తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి శనివారం చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్ సిరీస్‌లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ నటులు రెవెన్యూ షేర్ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు.


