కల సాకారం! | - | Sakshi
Sakshi News home page

కల సాకారం!

Mar 15 2026 5:11 AM | Updated on Mar 15 2026 5:11 AM

వేళచ్చేరి నుంచి ఎంఆర్‌టీఎస్‌

రైలు పరుగు

సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వైపుగా పయనం

ఆనందంలో పరిసర వాసులు

దూసుకెళ్తున్న

ఎంఆర్‌టీఎస్‌ రైలు

సాక్షి, చైన్నె: 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చైన్నె నగరంలో కీలక రైల్వే ప్రాజెక్టు ఆదివారం కార్యరూపం దాల్చింది. వేళచ్చేరి నుంచి సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వైపుగా ఎంఆర్‌టీఎస్‌ రైలు పట్టాలెక్కింది. ఈ క్షణాన్ని ఓ పండుగ తరహాలో ఆ పరిసర వాసులు ఆనందతాడవం చేశారు. వివరాలు.. చైన్నె బీచ్‌ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్‌టీఎస్‌ సేవలు సాగుతూ వచ్చాయి. ఈ మార్గంలో సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వరకు రైలు సేవకు ముందుగా నిర్ణయించినా స్థల సేకరణ వివాదంలో ఈ ప్రాజెక్టు చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్లు ఈ మార్గంలో రైలు సేవ కోసం పరిసర వాసులు నిరీక్షించక తప్పలేదు. దక్షిణ చైన్నె పరిధిలో అనేక అభివృద్ధి చెందిన, కీలక ప్రాంతాలు ఈ మార్గంలో తాజాగా ఉండడంతో రవాణా మరింత సులభతరం కావాలన్న ఎదురు చూపులు ఆ పరిసరాలలో నెలకొంది. ఎట్టకేలకు అడుగులు ముందుకు పడ్డాయి. రైల్వే మార్గం పనులు శరవేగంగా ముగించారు. వేళచ్చేరి నుంచి పులిది వాక్కం, ఆదంబాక్కం, వానువాం పేటను కలుపుతూ సెయింట్‌ థామస్‌ మౌంట్‌ స్టేషన్‌ వరకు ఎంఆర్‌టీఎస్‌ రైలు పట్టాలెక్కించారు. వాస్తవానికి ఈనెల 10వ తేదీన రైలు పట్టాలెక్కాల్సి ఉండగా ఈమార్గంలో రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ సెక్షన్‌పై రైల్వే భద్రతా చీఫ్‌ కమిషనర్‌ చట్టబద్ధమైన తనిఖీలలో వెలుగు చూసిన లోటు పాట్లను సరిచేయాల్సి వచ్చింది. వేళచ్చేరి – సెయింట్‌ థామస్‌ మౌంట్‌ స్టేషన్ల మధ్య హైస్పీడ్‌ ట్రయల్‌ రన్‌ న్యూఢిల్లీలోని రైల్వే సేఫ్టీ చీఫ్‌ కమిషనర్‌ జనక్‌ కుమార్‌ గార్గ్‌ సమక్షంలో విజయవంతం చేశారు. దీంతో 18 ఏళ్ల నాటి కల శనివారం సాకారమైంది.

రైల్వే హబ్‌గా..

చైన్నెలో సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వే స్టేషన్‌ రైల్వేహబ్‌గా మారనుంది. ఈ మేరకు ఇక్కడ పనులు చేపట్టనున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ ఎలక్ట్రిక్‌ రైలు, ఎంఆర్‌టీఎస్‌ రైలు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, తాజాగా ఎంఆర్‌టీ ఎస్‌ కనెక్టివిటికి కేంద్రంగా మారింది. ఈ దృష్ట్యా చైన్నె లో మరో రైల్వే హబ్‌గా సెయింట్‌ థామస్‌ మౌంట్‌ను తీర్చిదిద్దేందుకు రైల్వేయంత్రాంగం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

పట్టాలెక్కిన ఎంఆర్‌టీఎస్‌..

ఆదివారం ఉదయం బీచ్‌ నుంచి వేళచ్చేరి మీదుగా సెయింట్‌ థామస్‌ మౌంట్‌ వరకు ఎంఆర్‌టీఎస్‌ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటలకు మంత్రి అన్బరసన్‌తో పాటూ అధికారులు, డీఎంకే వర్గాలు రైలులో పయనిస్తూ ఆనందాన్ని ప్రయాణికులతో పంచుకున్నారు. వేళచ్చేరి – సెయింట్‌థామస్‌ మౌంట్‌ మధ్య తాజాగా ఆరు సర్వీసుల సేవలు అందించేందుకు నిర్ణయించారు. తదుపరి క్రమంగా సంఖ్యను పెంచనున్నారు. బీచ్‌ – వేళచ్చేరి – సెయింట్‌ థామస్‌ మధ్య రాత్రి 11.25 గంటల వరకు రైలు సేవలు అందించనున్నారు. చివరి రైలు బీచ్‌లో రాత్రి 10.25 గంటలకు బయలు దేరనుంది. అనేక స్టేషన్లలో ప్రజలు స్వీట్లు పంచి పెట్టి,పువ్వులను చల్లి రైలును ఆహ్వానించారు. బీచ్‌ నుంచి దక్షిణ చైన్నె వైపుగా వెళ్లే వారికి తాజాగా రవాణా మరింత సులభతరంగామారినట్లయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement