– డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె:2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు హ క్కుల రక్షణకు, ఢిల్లీ పెత్తనానికి మధ్య జరిగే యుద్ధం అని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు జట్టుకు ఢిల్లీ జట్టుకు మధ్య జరిగే సమరంలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్దామని యువజనులకు పిలుపు నిచ్చారు. ధర్మపురిలో శనివారం డీఎంకే పార్టీ యువజన, ఇతర అనుబంధ విభాగాల నేతలతో ఉదయ నిధి స్టాలిన్ సమావేశమయ్యారు.
అనుబంధ విభాగాలే పార్టీకి రెక్కలు
ఉదయనిధి మాట్లాడుతూ, పార్టీలోని యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్, ఐటీ వింగ్ వంటి అనుబంధ విభాగాలను ఉద్దేశించి మాట్లాడుతూ పక్షి ఎగరడానికి రెక్కలు ఎంత ముఖ్యమో, డీఎంకే వరుస విజయాలు సాధించడానికి ఈ విభాగాలు కూడా అంతే ముఖ్యం అని వివరించారు. ఈ విభాలపై పార్టీ ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నట్టు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో సీఎ స్టాలిన్ ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గుర్తుచేస్తూ, ఇవే ఎన్నికలలో డీఎంకేకు ఆయుధాలు అని వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంపై తీవ్ర విమర్శలు
తమిళనాడు విద్యా, ఆర్థిక హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. హిందీని రుద్దే కొత్త విద్యా విధానాన్ని సీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, నిధుల కేటాయింపులలో కేంద్ర తమిళనాడుకు తీవ్ర అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎడప్పాడి పళనిస్వామి నేతత్వంలోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి బానిసలా మారిందని విమర్శించారు. బిహార్‌లో నితీష్ కుమార్‌కు పట్టిన గతే రానున్న రోజులలో పళనిస్వామికి పడుతుందని, బీజేపీ త్వరలోనే అన్నాడీఎంకేను మింగేస్తుందని హెచ్చరించారు. సీఎం నిర్దేశించినట్లుగా రాబోయే ఎన్నికల్లో 200 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి, స్టాలిన్‌ను రెండోసారి సీఎంగా చూడడమే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. రానున్న 40 రోజులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, రోజూ కనీసం 50 నుండి 60 మంది ఓటర్లను కలవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఐటీ వింగ్ మరింత చురుగ్గా ఉండాలని, మహిళా విభాగం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని ఉదయనిధి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, చక్రపాణి, జిల్లా కార్యదర్శులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
హాజరైన అనుబంధ విభాగాల నేతలు


