తిరుత్తణిలో కార్తీక సందడి
తిరుత్తణి: ఆదివారం కార్తీక మాసం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కార్తీకమాసం తొలి ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం స్వామికి అభిషేక ఆరాధన పూజలు నిర్వహించి బంగారు కవచం అలంకరణలో మహాదీపారాధన చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. దీంతో ఘాట్‌రోడ్డులో వాహనాలు స్తంభించి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కొండ ఆలయంలో వివిధ పనులు జరుగుతున్న క్రమంలో వాహనాల పార్కింగ్ స్థల సమస్య తలెత్తడంతో వ్యాన్‌లు, బస్సులను కొండ కింద భాగంలో పార్క్ చేసి భక్తులు నడిచి కొండకు చేరుకున్నారు. అదేసమయంలో ఆలయం ద్వారా భక్తుల సౌకర్యార్థం బస్సులు నడిపారు. ఉచిత దర్శనానికి 3గంటలు, రూ.100 దర్శనానికి గంట వేచివుండి భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 5గంటలకు పంచామృత అభిషేక పూజలు చేశారు. రాత్రి 8 గంటలకు ఉత్సవర్లు స్వర్ణరథంపై కొలువుదీరి కొండ ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
తిరుత్తణిలో కార్తీక సందడి
తిరుత్తణిలో కార్తీక సందడి


