లవ్ ఓ లవ్ అంటున్న పవీష్
తమిళసినిమా: నిలవుక్కు ఎన్‌మేల్ ఎప్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన యువ నటుడు పవీష్. ఈయన ధనుష్ మేనల్లుడు అన్నది గమనార్హం. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన పవీష్ తాజాగా తన రెండో చిత్రంలో నటిస్తున్నారు. సినిమా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ అధినేత దినేష్‌రాజ్, క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత ధనుంజయ్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ రాజేంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు లక్ష్మణన్ శిష్యుడు అన్నది గమనార్హం. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ యూట్యూబర్ నాగదుర్గ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ గత అక్టోబర్‌లో దర్శకుడు కస్తూరిరాజా చేతుల మీదుగా ప్రారంభమైంది. తాజాగా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చిత్రానికి లవ్ ఓ లవ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దర్శకుడు మాట్లాడుతూ ఈతరం యువత ప్రేమను, వారి మనస్తత్వాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఎమోషనల్‌తో కూడిన ఎంటర్‌టైనర్ కథాంశంతో సాగే ఈ చిత్రంలో పవీష్, నాగదుర్గ ఫ్రెష్‌నెస్‌తో కూడిన రిలేటబుల్ నటనను ప్రేక్షకులు చూస్తారన్నారు. ఈచిత్ర షూటింగ్ చైన్నెలోని పలు రిస్కీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. తొలి షెడ్యూల్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు.
నాగదుర్గ, పవీష్, చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్


