బోయకొండ జన సందడి
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరగడంతో బోయకొండపై ఎటుచూసినా భక్త జన సందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మ వారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి , బోనాలు సమర్పించి అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


