అపురూపం..
రేపటి నుంచి తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వేడుకలు
హరోంహర నామస్మరణాలతో పులకిస్తున్న అన్నామలైయార్ ఆలయం
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
పుష్పాలంకరణలో ఉన్న దుర్గమ్మ
వేలూరు: కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అరుణాచలేశ్వరాలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఆలయంలో శివ దేవుడు అగ్ని రూపం దాల్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. మహా విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ఏర్పడింది. మహా విష్ణువు ఆదిశేషునిపై పవలించి వుండగా బ్రహ్మ అటువైపు వెళ్లారు. తాను వస్తుంటే కనీసం గౌరవించాల్సిన పనిలేదా..? అని విష్ణువును ప్రశ్నించారు. ఇందుకు విష్ణువుకు కోపం వచ్చి తనతో సహా లోకంలోని అన్ని జీవరాసులు తన బొడ్డునుంచే పుట్టాయని చెప్పాడు. దీంతో వారిద్దరి మద్య పెద్ద వివాదం ఏర్పడింది. ఇద్దరు కలసి శివుడు వద్దకు వెళ్లారు. శివుడు వారిద్దరికి ఓ పరీక్ష పెట్టారు. తన జటాజూటం చివరి వరకు వెళ్లి రావాలని బ్రహ్మకు, తన పాదము వద్దకు వెళ్లిరావాలని విష్ణువుకు పోటీ పెట్టాడు. ఈపోటీల్లో ఎవరు ముందు వెళ్లివస్తారో వారే గొప్ప అని శివుడు వారికి వివరించాడు. విష్ణువు వెంటనే కూర్మావతారం ధరించి శివుడు పాదం కోసం భూమిలోకి దూసుకెళ్లాడు. అలాగే బ్రహ్మ అన్నపక్షి అవతారం ధరించి శివుని జటాజూటం కోసం వెళ్లాడు. కొన్ని యుగాలు గడిచినా వారిద్దరు గమ్య స్థానానికి చేరుకోలేక పోయారు. ఆ స్థలమే తిరువణ్ణామలై కనుక శివుడు జ్యోతిమయమై విష్ణువు, బ్రహ్మకు దర్శనమిచ్చారు. దీంతో ఇది పంచలింగ క్షేత్రాల్లో అగ్ని స్థలంగా పేరుగా నిలిచింది.
తొమ్మిది రాజగోపురాలు
ఆలయాన్ని అతిపెద్ద రాజగోపురాలు, తిరుమంజన గోపురం, అమ్మని అయ్యామ్ గోపురం, పేయ్ గోపురాల ద్వారా ఆలయ ప్రహరిలోకి ప్రవేశించవచ్చు. దీని తరువాత భక్తులు అన్నామలైయార్ సన్నదికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయంలోనికి వెళ్లాలంటే ఐదు ప్రహరి దారులున్నాయి. గ్రహ గోపుర దారులు కూడా ఉన్నాయి. ఆలయం చుట్టూ ఆరు ప్రాకారాలున్నారు. ఏడవ ప్రాకారం శివలింగం కొండకు వెళ్లే దారిగా ఉంటుంది. ఈ క్షేత్రంలో కార్తీక మహా దీపోత్సవం సందర్భంగా ఏటా పది రోజుల పాటు కార్తీక దీపోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. రాజుల కాలం నాటి నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు కొండపై మహా దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. భక్తుల నుంచి కానుకగా వచ్చిన నెయ్యితో సూర్యుడు అస్తమించిన తరువాత సుమారు 6 గంటల సమయంలో మహా దీపాన్ని ఆలయం వద్దనున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై వెలిగిస్తారు. 24 మూరల కొత్త గాడ గుడ్డతో దీపానికి ఒత్తిని తయారు చేస్తారు. మహా దీపాన్ని సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా వుండగా ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతూనే ఉంటుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
దుర్గమ్మ పూజతో..
అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత నిర్వహించే దుర్గమ్మ ఉత్సవం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. అనంతరం ప్రత్యేక బాన వేడుకల నడుమ దుర్గమ్మ వారిని కామదేను వాహనంలో ఉంచి మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక శనివారం రాత్రి పిడారియమ్మన్ ఉత్సవం నిర్వహించారు.ఆదివారం రాత్రి వినాయకుని ఉత్సవం జరగనుంది. తర్వాత బ్రహోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
అపురూపం..


