కోవై, ఈరోడ్ పర్యటనకు స్టాలిన్
సాక్షి, చైన్నె : క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ కోయంబత్తూర్ , ఈరోడ్ జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. 25,26 తేదీలలో జరగనున్న సీఎం పర్యటన నిమిత్తం ఇక్కడ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ ప్రాచీన భాషా పార్కును ముస్తాబు చేశారు. వివరాలు.. 2010లో కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ ప్రాచీన మహానాడులో క్లాసికల్ పార్క్(సెమ్మోళి పార్కు) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తదుపరి పదేళ్లు డీఎంకేకు అధికారం దూరమైంది. తన తండ్రి, దివంగత నేత కరుణానిధి ఇచ్చిన హామీని సాకారం చేసే విధంగా క్లాసికల్ లాంగ్వేజ్ పార్క్ ఏర్పాటుకు 2023లో సీఎం స్టాలిన్ చర్యలు తీసుకున్నారు.45 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలతో రూ. 208 కోట్లతో ఈ పార్కును తాజాగా తీర్చిదిద్దారు. ఈనెల 25న ఈ పార్కును సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. అలాగే కోయంబత్తూరులో టీఎన్ రైస్ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో పెట్టుబడిదారులతో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాత్రి కోయంబత్తూరులో బస చేసే సీఎం మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఈరోడ్ జిల్లా మోదకురిచ్చిలోని జయరాంపురంలో జరిగే స్వాతంత్య్ర సమరయోధుడు మా వీరన్ పోలన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ. 4.90 కోట్లతో నిర్మించిన స్మారక మందిరాన్ని ప్రారంభిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు దీరన్ చిన్నమలై విగ్రహాన్ని ఆవిష్కరించినానంతరం ఆయన పేరిట నిర్మించిన మణి మండపంను సందర్శించనున్నారు. అనంతరం జరిగే ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతారు. ఇందులో ఈరోడ్‌లో నిర్మించినకొత్త బస్టాండ్‌ను అక్కడి ప్రజలకు అంకితం చేయడమే కాకుండా,రూ. 605 కోట్లతో విలువైన భవనాన్ని ప్రారంభించనున్నారు.
కోవై, ఈరోడ్ పర్యటనకు స్టాలిన్


