సీట్ల కసరత్తు ప్రారంభం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల కసరత్తులపై తమిళనాడు కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఏఐసీసీ నేతృత్వంలో ఐదుగురు నేతలతో కూడిన కమిటీని శనివారం నియమించారు. ఈ కమిటీ డీఎంకేతో చర్చలు జరపనుంది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తోంది. తాజాగా కూడా డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ అధికారం దిశగా డీఎంకే విశ్వ ప్రయత్నాలలో నిమగ్నమైంది. అదే సమయంలో కూటమిలో పార్టీలు చేజారకుండా ముందు జాగ్రత్తలు విస్తృతం చేసింది. ఈ పరిస్థితులలో ఇటీవల కాలంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంతో కాంగ్రెస్ చర్చలు అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. డీఎంకేను కాంగ్రెస్ వీడే అవకాశాలు ఉన్నాయన్న పుకార్లు బయలు దేరాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా 2026లో అధికారంలో వాటా అన్న నినాదాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు అందుకునే పనిలో పడటం చర్చలకు బలాన్ని కలిగించినట్లయ్యింది. అలాగే విజయ్, రాహుల్ గాంధీ మధ్య ఫోన్‌లో సంప్రదింపులు జరిగినట్టుగా ఊపందుకున్న ప్రచారాన్ని డీఎంకేవర్గాలు తీవ్రంగానే పరిగణించినట్టు సమాచారం. చివరకు వ్యవహారం ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల వద్దకు చేరింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై హుటా హుటీన ఢిల్లీకి సైతం వెళ్లారు. రెండు రోజుల పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గేతో జరిగిన సమావేశంలో తమిళనాడులోని పరిస్థితులు,రాజకీయఅ ంశాలను గురించి సెల్వపెరుంతొగై వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఐదుగురితో కమిటీ..
పొత్తులపై వస్తున్న వందంతులు, ప్రచారాలకు చెక్ పెట్టేవిధంగా డీఎంకేతో చర్చలకు ఐదుగురితో సమన్వయ కమిటీనీ శనివారం ఏఐసీసీ రంగంలోకి దించింది. తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదనక్కర్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, తమిళనాడు కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్. ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్ ఆళ్వాలు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆహ్వానించారు. డీఎంకే, కాంగ్రెస్‌ల బంధం మరింత గట్టిదని చాటే దిశగా మున్ముందు ప్రయాణాలు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కమిటీ ప్రతినిధులు డీఎంకే వర్గాలతో సీట్ల పందేరం, నియోజకవర్గాల ఎంపిక తదితర పొత్తు కసరత్తుపై చర్చలు జరిపి, ఏఐసీసీ అధిష్టానంకు పంపించి, వారి ఆమోదంతో ప్రకటనలు విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా టీఎన్‌సీసీలో జిల్లాల అధ్యక్షులు నియామక కసరత్తు మొదలైంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక కమిటీ చర్యలు చేపట్టింది. పార్టీ పరంగాఉన్న 77 జిల్లాలకు అధ్యక్షులు, ఇతర నిర్వాహకుల ఎంపికపై దృష్టి పెట్టింది.


