తీరంలో మాక్ డ్రిల్
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో గురువారం భద్రతా పరంగా మాక్ డ్రిల్ జరిగంది. ఉగ్ర వాదుల చొరబాట్లను అడ్డుకునే విధంగా అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహించారు. తీర గ్రామాలలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరుగులు తీశారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు తరచూ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ డ్రిల్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించడం జరుగుతోంది. చైన్నె మొదలు కన్యాకుమారి వరకు ఉన్న 13 సముద్ర తీర జిల్లాల్లో ఈ డ్రిల్ జరుగుతుంది. గురువారం ఉదయాన్నే ఐదునర్నర గంటలకు ఈ డ్రిల్‌కు శ్రీకారంచుట్టారు. పోలీసులు, కోస్ట్‌గార్డ్, నావికాదళం, సముద్ర తీర భద్రత విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో తొలి రోజు ఈ డ్రిల్ నిఘా నీడలో జరిగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై పోలీసులు సముద్ర తీరాల్లో ని పలు ప్రాంతాల వైపుగా ఉరకలు తీశారు. ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఆయా సముద్ర తీర గ్రామాల్లో సైతం రంగంలోకి దిగి సోదాలు చేశారు. ప్రధానంగా వాహనాల తనిఖీలు జోరుగా నిర్వహించారు. జాలర్ల గ్రామాల్లో అనుమానితులపై నిఘా ఉంచే విధంగా అవగాహన డ్రిల్ నిర్వహించారు. నాగపట్నం, రామనాథపురం తదితర జిల్లాలో శ్రీలంకకు కూత వేటు దూరంలో ఉన్న ప్రాంతాలలో సముద్ర తీరంలో భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలతో డ్రిల్ జరిగింది.


