శ్రీలంక శరణార్థులకు 198 నివాసాలు
తిరువళ్లూరు: శ్రీలంక శరణార్థుల కోసం పెత్తికుప్పంలో నిర్మిస్తున్న 198 నివాసాలను కలెక్టర్ ప్రతాప్, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్ పరిశీలించారు. గుమ్మిడిపూండి సమీపంలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో 1,200 మంది నివాసం వుంటున్నారు. వీరికి ప్రభుత్వం శాశ్వత నివాసాలను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగానే శ్రీలంక శరణార్థుల కోసం మొదటి దశలో 198 నివాసాలను నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తయిన క్రమంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే గోవిందరాజన్, గ్రామీణాభివృధిశాఖకు చెందిన అధికారులతో కలిసి పరిశీలించారు. నివాసాల నాణ్యతను పరిశీలించిన చిన్నచిన్న లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. మౌలిక వసతులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ వందశాతం అన్ని వసతులను కల్పించిన తరువాత త్వరలోనే ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


