మళ్లీ విజయ్ మీట్ ది పీపుల్
సాక్షి, చైన్నె: కరూర్ విషాద ఘటనతో బ్రేక్ పడ్డ మీట్ ది పీపుల్ పర్యటనను మళ్లీ ముందుకు తీసుకెళ్లేందుకు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ సన్నద్ధమయ్యారు. డిసెంబరు 4వ తేదిన మ్యాంగో నగరం సేలం నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా అనుమతి కోరుతూ సేలం కమిషనర్‌ను టీవీకే వర్గాలు గురువారం విజ్ఞప్తి చేశాయి. వివరాలు.. 2026 ఎన్నికలు లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకెళ్లే విధంగా టీవీకే నేత, నటుడు విజయ్ చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రచారానికి కరూర్‌లో సెప్టెంబరులో చోటు చేసుకున్న విషాద ఘటన బ్రేక్ పడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ గాయం నుంచి కోలుకున్న టీవీకే వర్గాలు క్రమంగా పార్టీ పరంగా కార్యక్రమాలపై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. ఈ ఘటనతో కోర్టు సైతం ప్రచార సభలు, రోడ్ షోలకు మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పరిస్థితులలో విజయ్ మళ్లీ మీట్ ది పీపుల్ నినాదంతో ప్రజలలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ సారి పకడ్బందీగా భద్రతా పరంగా చర్యలు చేసుకుంటున్నారు. తన వ్యక్తిగత భద్రతతో పాటూ ప్రజలకు సైతం భద్రతను కల్పించే విధంగా మాజీ పోలీసులు, అధికారులతో కూడిన విజయ్ డిఫెన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫోర్స్‌కు శిక్షణ తాజాగా ఇస్తూ వస్తున్నారు. ఈ ఫోర్స్ పూర్తిగా విజయ్ ప్రచార సభలు జరిగే ప్రాంతాలలో ప్రజలకు భద్రత కల్పించే విధంగా వ్యవహరించే రీతిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇక పోలీసు భద్రత ఓ వైపు ఉన్నా, మరోవైపు తమ తరపున ముందు జాగ్రత్తగా కరూర్ ఘటన వంటి విషాదాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు విస్తృతం చేశారు. ఈ పరిస్థితులలో ఆగిన మీట్ ది పీపుల్స్ మళ్లీ మొదలెట్టేందుకు విజయ్ రెడీ అయ్యారు. ఈసారి మ్యాంగో నగరం సేలం నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సేలంకు చెందిన టీవీకే వర్గాలు గురువారం అక్కడి పోలీసు కమిషనరేట్‌తోపాటూ ఇతర పోలీసు అధికారులను కలిసి విజయ్ ప్రచార సభకు అనుమతితో పాటూ, భద్రత కల్పనకు సంబంధించిన లేఖలను సమర్పించారు. డిసెంబరు 4వ తేదీన సభకు విజయ్ తాజాగా నిర్ణయించినా, పోలీసులు ఇచ్చే అనుమతులు, సూచనలకు అనుగుణంగా లేదా ఏదేని మెలిక పెట్టిన పక్షంలో ఆ తదుపరి తేదీలను ఖరారు చేసుకోవాల్సిందే.


