నిన్న మెట్రో.. నేడు తేమశాతం పెంపునకు తిరస్కరణ
సాక్షి, చైన్నె : మదురై, కోయంబత్తూరు మెట్రో రైలు ప్రాజెక్టులను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా వరిలో తేమ శాతం పెంపునకు అనుమతి ఇవ్వక పోవడం తమిళనాట వివాదానికి దారి తీసింది. కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టు సాధన నినాదంతో డీఎంకే కూటమి నేతృత్వంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఇక, రైతులకు పీఎం మోదీ పెద్ద ద్రోహం చేశారంటూ సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. మదురై, కోయంబత్తూరులలో మెట్రో ప్రాజెక్టు కోసం అనుమతి కోరుతూ పంపిన నివేదిక కేంద్రం నుంచి వెనక్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరం కేంద్రంలోని బీజేపీ పాలకులపై రాష్ట్రంలో ఆగ్రహాన్ని రేపి ఉంది. సీఎం స్టాలిన్ సైతం ఈ ప్రాజెక్టులను సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి అయితే, ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ప్రాజెక్టుల కోసం వినతి పత్రం సైతం సమర్పించారు. ఈ పరిస్థితులలో కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టును అమలు చేయాల్సిందేనని నినదిస్తూ గురువారం డీఎంకే కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. మెట్రోకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకు హాజరైన నేతలు నినాదించారు. అలాగే,మదురైలోనూ నిరసనలు బయలుదేరాయి. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టు వ్యవహారంలో తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ వర్గాలు ఎదురు దాడికి దిగాయి.
అన్నదాతకు అన్యాయం
నైరుతీ, ఈశాన్య రుతు పవనాల రూపంలో తడిసిన వరి పంటను కేంద్ర బృందాలు గత నెల పరిశీలించి వెళ్లిన విషయం తెలిసిందే. తేమ శాతం నుంచి 17 నుంచి 22 శాతంకు పెంచాలని రైతులు విన్నవించారు. సీఎం స్టాలిన్ సైతం పీఎం మోదీకి ఈ పెంపు గురించి లేఖ రాశారు. అయితే, తేమ శాతం పెంపునకు కేంద్రం నిరాకరించి ఉండటం గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరులో జరిగిన మహానాడులో తాను రైతు పక్ష పాతి అని చాటుకుంటూనే, మరోవైపు తమిళనాడు రైతులకు పెద్ద ద్రోహం తలబెట్టారని సీఎం స్టాలిన్ ఎక్స్ పేజిలో ప్రకటించారు. వరిలో తేమ శాతం పెంచాలని విన్నవిస్తే నిరాకరించడం ద్రోహం కాదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదురై, కోయంబత్తూరు మెట్రో ప్రాజెక్టులను నిరాకరించిన మరుసటి రోజే వరిలో తేమ శాతం విషయంగా చేదు సమాచారం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణం ఈ అంశాలపై పునర్ పరిశీలించాలని డిమాండ్ చేశారు.
నిన్న మెట్రో.. నేడు తేమశాతం పెంపునకు తిరస్కరణ


