విద్యార్థులకు
44 పాలిటెక్నిక్ కళాశాలపై ప్రత్యేక దృష్టి
టాటా టెక్నాలజీస్‌తో సీఎం సమక్షంలో ఒప్పందం
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అప్‌గ్రేడ్
తమిళ పండితులకు పురస్కారాలు
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఉన్నత విద్యను మెరుగుపరిచే దిశగా విస్తృత కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం అనేక ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పడమే కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధి ద్వారా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చర్యలు చేపట్టారు. నాన్ మొదల్వన్ పథకం ద్వారా నైపుణ్యాల అభివృద్ధిని ఆరోతరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న విద్యార్థులకు దరి చేర్చారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నెలకు రూ.1000 ప్రోత్సాహకం అందజేస్తూ వస్తున్నారు. విద్యాలయాలను బలోపేతం చేస్తూ అఖిల భారత స్థాయిలో ఉన్నత విద్యలో తమిళనాడే నంబర్ –1 అని చాటే విధంగా దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కడలూరు జిల్లా వడలూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు రూ. 13.71 కోట్లతో కొత్త భవనం, విల్లుపురం జిల్లా సెంజి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు రూ. 13.92 కోట్లతో కొత్త భవనం, రూ. 14.50 కోట్లతో తిరుపత్తూరు జిల్లా నాట్రాం పల్లి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కొత్త భవనం, రూ. 15.60 కోట్లతో అరియలూరు జిల్లా జయం కొండం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు భవనం, మైలాడుతురై జిల్లా మనల్మేడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు రూ. 2.20 కోట్లతో భవనం నిర్మించారు. మొత్తం రూ. 59.93 కోట్లతో నిర్మించిన ఈ భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సచివాలయం నుంచి సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దే విధంగా 4.ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఎక్సలెన్స్ సెంటర్‌లుగా మార్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం 44 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఎంపిక చేశారు. వీటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూ. 2,590 కోట్ల వ్యయంతో అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్‌తో సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. విద్యను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను ఆదునీకరించడం, కొత్త పారిశ్రామిక పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, అధ్యాపకులలో బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడంతో పాటుగా సమర్థవంతమైన మానవ వనరులను సృష్టించడంలో సహాయపడటమే కాకుండా, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పెంపొందించడం, విద్యార్థులు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగనున్నారు. అనంతరం 190 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్లు లైబ్రేరియన్లు, 11 మంది అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు ఎంపికై న వారికి సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజే శారు. కార్యక్రమానికి ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శంకర్, కళాశాల విద్య కమిషనర్ ఎ. సుందరవల్లి, సాంకేతిక విద్య కమిషనర్ జె. ఇన్నోసెంట్ దివ్య, అన్నా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ (ఇన్–చార్జ్) డాక్టర్ వి. కుమరేషన్, టాటా టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్ షరబ్, గ్లోబల్ హెడ్ సుశీల్ కుమార్ హాజరయ్యారు.


