వెనక్కు వెళ్లిన సాగరం | - | Sakshi
Sakshi News home page

వెనక్కు వెళ్లిన సాగరం

Aug 26 2025 7:32 AM | Updated on Aug 26 2025 8:40 AM

రామేశ్వరం, పాంబన్‌లలో ఉత్కంఠ

సాక్షి, చైన్నె: రామేశ్వరం, పాంబన్‌ తీరంలో సముద్రం హఠాత్తుగా వెనక్కు వెళ్లింది. మూడు కి.మీ దూరం మేరకు సముద్రుడు వెనక్కు వెళ్లడంతో పడవలన్నీ ఒడ్డుకు చేరిన పరిస్థితి నెలకొంది. రామేశ్వరం, పాంబన్‌ సముద్రతీరంలో నిత్యం అలల తాకిడి అధికంగానే ఉంటుంది. రామేశ్వరానికి కూత వేటు దూరంలో కచ్చదీవులు ఉన్నాయి. ఈ దృష్ట్యా, ఇక్కడ అలల తాకిడితోపాటు గాలి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో భానుడి సెగ తప్పలేదు. చైన్నై శివారులలో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడ్డప్పటికీ, సోమవారం భానుడి ప్రతాపం కూడా అధికంగానే ఉండడం గమనార్హం. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలు కానున్న నేపథ్యంలో మరింతగా వర్షాలు పడుతాయన్న ఎదురు చూపులు పెరిగాయి. ఈ పరిస్థితులలో గాలి దిశ మార్పు ప్రభావంతో రామేశ్వరం, పాంబన్‌లలో సముద్రం హఠాత్తుగా వెనక్కు వెళ్లింది. మూడు కిలోమీటర్ల దూరం వరకు సముద్రం వెనక్క వెళ్లడంతో లంగర్‌ వేసి, ఆపి ఉన్న పడవలన్నీ ఒడ్డుకు చేరిన పరిస్థితి నెలకొంది. మళ్లీ సముద్రుడు ముందుకు వచ్చినప్పుడే ఆ పడవలను ఉపయోగించవచ్చు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై జాలర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం పాంబన్‌, రామేశ్వరంలలో వెనక్క తగ్గిన పక్షంలో ఏదేని విపత్తులను తీరవాసులు ఎదుర్కోక తప్పదన్న ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. అయితే సముద్రంలో గాలి దిశ మార్పు దృష్ట్యా రామేశ్వరం, పాంబన్‌లలో కొన్ని చోట్ల సముద్రం వెనక్కు వెళ్లినట్టుగా పరిశోధకులు పేర్కొంటున్నారు.

జీహెచ్‌లో నల్లకన్నుకు చికిత్స

సాక్షి, చైన్నె: సీపీఐ సీనియర్‌ నేత నల్లకన్నును చైన్నె రాజీవ్‌ గాంధీ జీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీపీఐ సీనియర్‌ నేతగా నల్లకన్ను అందరికీ సుపరిచితుడే. నిజాయితీకి ప్రతి రూపం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినా, గళం విప్పినా అది ఆయనకే సొంతం. కనీసం సొంత ఇళ్లు కూడా ఆయనకు లేదు. ప్రభుత్వ గృహంలో ఉన్నా, క్రమం తప్పకుండా అద్దె చెల్లించే వారు. నేటికీ తానో కుర్రోడ్ని అన్నట్టుగా చలాకీగా ముందుకు సాగే నల్లకన్ను గత ఏడాది 100వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ పరిస్థితులలో రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడ్డట్టు సమాచారం. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు. అయితే, ఆయనకు క్రమంగా నొప్పి తీవ్రత పెరగడంతో రాజీవ్‌ గాంధీ జీహెచ్‌కు తరలించారు. సోమవారం ఆయనకు వైద్యులు అన్ని విభాగాల వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం అన్ని రకాల పరిశోధనలతో ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు.

హిస్‌ స్టోరీ ఆఫ్‌ ఇతి హాస్‌కు తోడ్పాటు

సాక్షి, చైన్నె : భారత దేశ చారిత్రక కథనాన్ని పునర్‌ నిర్మించడానికి ఫీచర్‌ ఫిల్మ్‌ హిస్‌ స్టోరీ ఆఫ్‌ ఇతిహాస్‌కు ఒక ల్యాండ్‌ మార్క్‌ సహకారాన్ని భారతీయ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ప్రకటించింది. ఈ తోడ్పాటుతో వక్రీకరించబడిన చారిత్రక కథనాలను సవాలు చేయడం, భారతదేశ గతం గురించి మరింత ప్రమాణికమైన అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా విద్యా ఉద్యమాన్ని, శక్తివంతమైన సినిమాటిక్‌ స్వరాన్ని కల్పిస్తుందని మద్రాసు సంస్కృత కళాశాల ట్రస్టీ రమేష్‌ మహాలింగం తెలిపారు. సోమవారం మైలాపూర్‌లోని ఆర్‌ఆర్‌ సభలో ఈ చిత్ర ప్రదర్శనతో సహకారం గురించిన ప్రకటనను చేశారు. ఈ సహకారం అన్నది కేంద్రం ట్రూ ఇతిహాస ప్రాజెక్టుగా ఉంటుందని వివరించారు. శతాబ్దానికి పైగా మద్రాసు సంస్కృతి కళాశాల భారతీయజ్ఞాన వ్యవస్థలకు కట్టిన కోటగా ఉంటున్నట్టు ప్రకటించారు. లోతైన విద్యా వారసత్వాన్ని తీసుకుని, అధునిక ప్రేక్షకులకు అందించనున్నామన్నారు. సినిమా వంటి శక్తివంతమైన మాధ్యమంతో చేరడం ద్వారా నిజమైన ఇతిహాసం గురించిన ముఖ్య అంశాలను సమాజంలోని ప్రతి మూలకు చేర్చగలమన్నారు. హిస్‌ స్టోరీ ఆఫ్‌ ఇతి హాస్‌ దర్శకుడు మన్‌ ప్రీత్‌ సింగ్‌ ధామి మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక ఉత్ప్రేరకంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ పునర్‌ పరిశీలనకు చర్యలు తీసుకున్నామన్నారు. సినిమా జ్రలను ఆలోచింప చేసే , వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నించే శక్తిని కలిగిఉన్నట్టు వివరించారు.

వెనక్కు వెళ్లిన సాగరం 
1
1/2

వెనక్కు వెళ్లిన సాగరం

వెనక్కు వెళ్లిన సాగరం 
2
2/2

వెనక్కు వెళ్లిన సాగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement