యువ ప్రతిభకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

యువ ప్రతిభకు ప్రోత్సాహం

Aug 26 2025 8:40 AM | Updated on Aug 26 2025 8:40 AM

యువ ప్రతిభకు ప్రోత్సాహం

యువ ప్రతిభకు ప్రోత్సాహం

జర్నలిజం విద్యపై చైన్నెలో ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు

ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

ఎంజీఆర్‌ ఫిల్మ్‌ శిక్షణ సంస్థలో ప్రత్యేక సౌకర్యాలు

ఉన్నత విద్యా భవనాలు ప్రారంభం

89 మందికి గ్రూప్‌– 1 అధికారుల నియామకం

హెల్ప్‌లైన్‌లో తనిఖీలు

సాక్షి, చైన్నె: నాణ్యమైన విద్యను అందించడానికి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మీడియా స్టడీస్‌ దోహదకరంగా ఉంటుందని సీఎం స్టాలిన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. తమిళాభివృద్ధి, సమాచార శాఖ నేతృత్వంలో కోట్టూరు పురం తమిళ ఆన్‌లైన్‌ విద్యా సంస్థప్రాంగణంలో నిర్మించిన ఇన్‌స్టిట్యూట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మీడియా స్టడీస్‌ పేరిట ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులకు నిర్ణయించారు. యువతరం జర్నలిజంపై ఆసక్తి కలిగి ఉందని, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా తమిళనాడు యువతకు జర్నలిజం విద్యను అందించడం, అవగాహన కల్పించడం, రాబోయే తరానికి తక్కువ ఖర్చుతో ఓ సంవత్సరం మాస్టర్‌ డిగ్రీగా జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాను అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. చైన్నె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజంకు రూ. 7.75 కోట్లు నిధులను కేటాయించారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి తమిళం, ఆంగ్లంలోనూ శిక్షణ అందించనున్నట్టు సీఎం వివరించారు. ప్రింట్‌, టెలివిజన్‌, రేడియో, ఆన్‌ లైన్‌ మీడియాలో పనిచేయడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవసరమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేశామని, అంతర్జాతీయ విద్యా సంస్థలతో కలిసి ఈ విద్యా సంస్థ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా తొలి బ్యాచ్‌ విద్యార్థులతో సీఎం స్టాలిన్‌ ముచ్చటించారు.

ఎంజీఆర్‌ ఫిల్మ్‌ శిక్షణ సంస్థ

ఎంజీఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ శిక్షణ సంస్థ ప్రాంగణాన్ని రూ. 5.10 కోట్లతో పునరుద్ధరించారు. పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ సౌకర్యంతో తరమణిలో రూపొందించిన భవనాన్ని సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తోంది. సాంకేతిక విద్య కళాత్మక శిక్షణను, సినిమా, టెలివిజన్‌ కార్యక్రమాలు సృష్టించడమే లక్ష్యంగా అవసరమైన సాంకేతికతలు, ఇతర అంశాలు, చిత్రనిర్మాణ పాఠాలను కూడా ఇక్కడ నేర్చుతున్నారు.తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ శిక్షణా సంస్థ అభివృద్ధిలో భాగంగా శిక్షణా సంస్థలో రూ. 1.58 కోట్లతో ఆడిటోరియం నిర్మించినట్టు ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ సంస్థలో చదువుతున్న నాల్గవ సంవత్సరం విద్యార్థుల ప్రయోజనం కోసం ఫైనల్‌ ప్రాజెక్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ నిర్మాణ ఖర్చుగా ఒక్కో దానికి రూ. లక్ష అందజేస్తున్నామన్నారు. శిక్షణ సంస్థ ప్రాంగణంలో మేకప్‌ గదులు, అలంకరణ, ఎయిర్‌ కండిషనింగ్‌తో కూడిన డ్రెస్సింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌ తీర్చిదిద్దామన్నారు. విద్యార్థి హాస్టల్‌, కోర్టు, జైలు సెట్టింగ్‌తో కూడిన నిర్మాణ ప్రదేశంలో మరిన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ వేదిక చిత్ర పరిశ్రమకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రకటించారు.

ఉన్నత విద్యా భవనాలు..

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ నేతృత్వంలో రూ. 51.04 కోట్లతో నిర్మించిన విద్యా భవనాలను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ తరపున, అలగప్ప చెట్టియార్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల, అలగప్ప విశ్వవిద్యాలయం, ప్రభుత్వ కళలు, విజ్ఞాన శాస్త్రంలతో పాటూ 51 కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యాభవనాలు, తరగతి గదులు, పరీక్షా హాల్స్‌, ప్రయోగ శాఖల భవనాలు ఉన్నాయి. అలాగే రూ. 173.86 కోట్లతో నిర్మించిన 19 కొత్త ప్రభుత్వ వృత్తి శిక్షణా కేంద్రాలు, 3 కొత్త వృత్తి శిక్షణ కేంద్ర భవనాలు, కార్మిక శిక్షణ కేంద్రం, వర్కర్స్‌ యూనియన్‌ ఆఫీస్‌ భవనం రెస్ట్‌ హోంలను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. కార్మిక సంక్షేమ శాఖ నేతృత్వంలో తిరుప్పూర్‌ , కృష్ణగిరి, తిరువళ్లూరు, కాంచీపురం, తిరుప్పరకుండ్రం, మన్నచ్చనల్లూరు ఒట్టన్‌ చత్రంలలో ఈ నిర్మాణాలు జరిగాయి.

చైన్నెలోని కోట్టూరు పురంలోని ముఖ్యమంత్రి సహాయ కేంద్రాన్ని సీఎం తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌– టోల్‌ ఫ్రీ 1100కు వచ్చిన కాల్స్‌ను పరిశీలించారు. ఈ కేంద్రం ప్రతిరోజూ తెరిచి ఉంటుందని, 16 గంటల పాటూ మూడు షిఫ్టులుగా 120 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని అక్కడి అధికారుల సీఎంకు వివరించారు. ఈ–సేవలకు సంబంధించిన సేవలు, హెల్ప్‌డెస్క్‌ విధివిధానాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మీతో స్టాలిన్‌ విజ్ఞప్తులను, పరిష్కారాలను గురించి ఆరా తీశారు. ఈ తనిఖీలో సీఎంతో పాటూ డిప్యూటీ సీఎం ఉదయ నిధి సాలిన్‌, మంత్రి స్వామినాథన్‌, ప్రత్యేక అధికారి టీ జయ శీలన్‌ ఉన్నారు.

ఉద్యోగ నియామకాలు...

తమిళనాడు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎన్‌పీఎస్సీ) ద్వారా 15 మంది డిప్యూటీ కలెక్టర్లు, 23 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్‌ పోలీస్‌, 14 మంది అసిస్టెంట్లు 21 సహకార సంఘాల కమిషనర్లు (వాణిజ్య పన్ను), డిప్యూటీ కమిషనర్లు, రిజిస్ట్రార్లు, 14 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు (గ్రామీణాభివృద్ధి), ఒక జిల్లా ఉపాధి అధికారి , ఒక జిల్లా అధికారి అగ్నిమాపక అధికారి అంటూ మొత్తం 89 మందిని ఎంపిక చేశారు. వీరిలో 20 మందికి సీఎం స్టాలిన్‌ సచివాలయంలో స్వయంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. గ్రూప్‌–1 పోస్టులకు ఎంపికై న వారందరికి సీఎం స్టాలిన్‌ తన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమాలలోడిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌, ద్రవిడ కళగంనేత కె వీరమణి, మంత్రులు స్వామినాథన్‌, ఎం. సుబ్రమణియన్‌, రఘుపతి, కయల్వెలి సెల్వరాజ్‌, శివశంకర్‌, సీవీ షణ్ముగం, ఎంపీ విజయ్‌ వసంత్‌, సీఎస్‌ మురుగానందం, సమాచార శాఖ కార్యదర్శి వి. రాజారామన్‌, ప్రెస్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీ ఆర్‌. వైద్యనాథన్‌, తమిళనాడు ప్రభుత్వం ఎం.జి.ఆర్‌. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ శిక్షణ సంస్థ అధ్యక్షుడు మరుదు, ప్రిన్సిపాల్‌ ఎం. మేఘవర్ణం, సీనియర్‌ పాత్రీకేయులు నక్కీరన్‌ గోపాల్‌, తిరుమవేలన్‌, కార్తిగై సెల్వన్‌, సురేష్‌ కుమార్‌, గుణశేఖరన్‌, సమస్‌, లక్ష్మీ సుబ్రమణియన్‌,కామరాజ్‌, నిరుబన్‌ చక్రవర్తి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి పి. శంకర్‌, సాంకేతిక విద్య కమిషనర్‌ జె. ఇన్నోసెంట్‌ దివ్య,, కళాశాల విద్య కమిషనర్‌ ఎ. సుందరవల్లి, కార్మిక సంక్షేమ శాఖ కార్యదర్శి వీర రాఘవరావు, ఉపాధి , శిక్షణ శాఖ డైరెక్టర్‌ పి. విష్ణు చంద్రన్‌ తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement