
అభ్యసన ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి
తిరువళ్లూరు: విద్యార్థులు జీవితంలో విజయం సాదించడానికి నిరంతరం అభ్యసన ప్రక్రియను కొనసాగించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని టీసీఎస్ గ్లోబల్ హెడ్ డాక్టర్ సుశీంద్రన్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌కుప్పంలోని ప్రత్యూ ష ఇంజినీరింగ్ కళాశాలలో 25వ బ్యాచ్ నూతన విద్యార్థులను ఆహ్వానించే కార్యక్రమం చైర్మన్ రాజారావు అధ్యక్షతన సోమవారం ఉదయం కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీసీఎస్ గ్లోబల్ హెడ్ డాక్టర్ సుశీంద్రన్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన తరువాత పీఈసీ ఈవెంట్–25 మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. కళాశాల చైర్మన్ రాజారావు మాట్లాడుతూ తమ కళాశాలలో దార్శనికత, విద్యార్థుల విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. క్రమశిక్షణ అకింతభావంతో కూడిన విద్యను అందించడానికి ప్రత్యూష కళాశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సుశీంద్రన్ మాట్లాడుతూ విద్యార్థుల ఆవిష్కరణ, నిరంతరం అభ్యసన ప్రక్రియను స్వీకరించాలని సూచించారు. దీంతో పాటు శ్రీశివరామయ్య మెరిట్ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికయిన విద్యార్థులను కార్యక్రమంలో సత్కరించారు. అనంతరం మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగు లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ హెచ్‌ఓడీ ఉమ, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.