
తెలుగువారికి గర్వకారణం.. ఓమందూరర్
కొరుక్కుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించిన ఓమందూరర్ పి.రామస్వామి రెడ్డియార్ తెలుగు వారు కావడం అందరికీ గర్వకారణమని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి కొనియాడారు. ఈ మేరకు చైన్నె కీల్పాక్కంలోని ఏఐటీఎఫ్ ప్రదాన కార్యాలయంలో తెలుగువారి ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి ఓమందూరర్ పి.రామస్వామి రెడ్డియార్ వర్థంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి ఓమందూరర్ చిత్రపటానికి ఏఐటీఎఫ్ కార్యవర్గ సభ్యులతో కలసి డాక్టర్ సీఎంకే రెడ్డి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలను అందించిన మహనీయులు ఓమందూరర్ అని, ఆయన తెలుగువారు కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. ఆలయాలను అభివృద్ధి పరచడమే కాకుండా పేదప్రజలకు, దళితులకు ఆయన చేసిన సేవలు ఎవ్వరూ మరువలేమని వ్యాఖ్యానించారు. ఓమందూరర్ పి.రామస్వామి రెడ్డియార్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వ ఆసుపత్రికి ఓమందూరర్ పేరు పెట్టడం, మణిమండపం ఏర్పాటు చేయడం, హోసూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలకృష్ణారెడ్డి చొరవతో అసెంబ్లీలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం నిజంగా తెలుగు వారి దక్కిన గౌరవమని అభిప్రాయపడ్డారు. ఏడుగురు తెలుగు నాయకులు తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించి, ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. తెలుగు మహనీయులు చరిత్రను భావితరాల యువత తెలుసుకోవాలన్నారు. అందుకోసమే ఏఐటీఎఫ్ తరఫున వారి జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఏఐటీఎఫ్ ప్రదాన కార్యదర్శి ఆర్.నందగోపాల్, ఉపాధ్యక్షులు సీఎం కిషోర్‌తోపాటు ఎన్.నాగభూషణం, గొల్లపల్లి ఇశ్రాయేల్, తిరుమలరావు, బి.నాగేంద్రన్‌రెడ్డి, తిరునెల్వేలి రామసుబ్బు తదితరులు పాల్గొన్నారు.