
కెప్టెన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు!
సాక్షి, చైన్నె: కెప్టెన్ విజయకాంత్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్ స్పష్టం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. విజయకాంత్ కాలేడని తేల్చి చెప్పారు. డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, పురట్చి కలైంజ్ఞర్ విజయకాంత్ జన్మదినాన్ని ఆది నుంచి పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ లోకంలో లేరు. ఈ నేపథ్యంలో ఆయన జయంతిని ఆదివారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలతో తరలి వచ్చి నివాళుళర్పించారు. ఆయన విగ్రహానికి డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పూల మాలలు వేశారు. సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసినానంతరం పేదలకు సహాయకాలను పంపిణీ చేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వర్గాలు అక్కడక్కడా జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చైన్నెలో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ విజయకాంత్‌ను విజయ్ తన సోదరుడిగా భావించడంలో తప్పు లేదన్నారు. ఆయన మీదున్న ప్రేమను విజయ్ మహానాడు వేదికగా తెలియజేసుకున్నారని పేర్కొంటూ, అయితే విజయ్ విజయకాంత్ కాలేడని, కెప్టెన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పేర్కొంటూ, డీఎండీకే బలంగానే ఉందని, కార్యక్రమాలు మరింతగా విస్తృతం చేయనున్నామన్నారు. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా, ఇందుకు ఇది సమయం కాదని, పొత్తు ఎవరితో అన్నది జనవరిలో స్పష్టం చేస్తామన్నారు. విజయకాంత్‌లా మరొకరు రాలేరని, ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం అసాధ్యం అని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులకు ప్రోత్సాహాకాల పంపిణీ
సహాయకాలు అందుకున్న మహిళలతో ప్రేమలత

కెప్టెన్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు!