
రోడ్డు మరమ్మతులు చేయాలని రాస్తారోకో
తిరువళ్లూరు: పాక్షికంగా దెబ్బతిన్న రోడ్డును సరి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలుసార్లు ఉన్నత అధికారులకు వినతిపత్రం సమర్పించినా పలితం లేకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఆదివారం ఉదయం కడంబత్తూరులో రాస్తారోకో నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ మేట్టుకాలనీలో సుమారు వంద కుటుంబాలు ఉంన్నాయి. ఈ కుటుంబాలు రాకపోకల కోసం ఏర్పాటు చేసిన రోడ్డును పదిహేనేళ్ల క్రితం తారురోడ్డుగా మార్చారు. అయితే ఇటీవల తారు రోడ్డు పాక్షికంగా దెబ్బతింది.దీంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అత్యవసర సేవలకు సైతం సకాలంలో వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇందులో భాగంగానే రోడ్డును సరి చేయాలని పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న కడంబత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. స్థానికుల రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.