సాక్షి, చైన్నె: మధుమేహం నివారణ లక్ష్యంగా ఆచరణాత్మకంతోకూడిన నైపుణ్యాలను విస్తృతం చేయాల్సిన అవసరముందని వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. చైన్నెలోని గ్లెనీల్స్ ఆస్పత్రిలో డయాబెటిస్ పరిణామంపై సీఓడీఈ 2025 సదస్సు ఆదివారం జరిగింది. ఇందులో 700 మంది వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పరిశోధకులు, విధాన నిపుణులు పాల్గొని, డయాబెటిస్ సంరక్షణ,నైపుణ్యం, అభివృద్ధి చెందుతున్న అంశాలు, ధోరణులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్లెనీల్స్ సీఈఓ నాగేశ్వరరావు ఈ సదస్సును ప్రారంభించారు. సదస్సు చైర్మన్ డాక్టర్ అశ్విన్ కరుప్పన్, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఆఫ్రిన్ షబ్బీర్ సమక్షంలో పలు అంశాల గురించి చర్చలు జరిగాయి. నైపుణ్యాన్ని పంచుకోవడానికి, ఉద్భవిస్తున్న ధోరణలును చర్చించడానికి, డయాబెటిస్ సంరక్షణకు భవిష్యత్తు కార్యాచరణ అంశాలను నిపుణులు విశదీకరించారు. ఈ సందర్భంగా అశ్విన్ కరుప్పన్ మాట్లాడుతూ డయాబెటిస్ నుంచి రోగులను సంరక్షించేందుకు అధునాతన చికిత్సలు, భవిష్యత్తు కేంద్రీకృత వ్యూహాలకు ఈ సమావేశం వేదికగా నిలుస్తున్నట్టు వివరించారు. ఆఫ్రిన్ షబ్బీర్ మాట్లాడుతూ డయాబెటిస్ సంరక్షణ వైద్యులకే పరిమితం కాకూడదని, రోగి ఫలితాలలో మార్పు తీసుకు రావడానికి ప్రతి ఆరోగ్య సంరక్షణ నిపుణుడు సరైన జ్ఞానం, నైపుణ్యాలతో సాధికారత పొందాలని సూచించారు.