
18 కిలోల గంజాయి స్వాధీనం
– ఇద్దరు యువకులు అరెస్టు
తిరువళ్లూరు: గంజాయిని అక్రమంగా తరలించి, యువతే లక్ష్యంగా విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌లో మాదక ద్రవ్యాల నిరోధకశాఖ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెడ్‌హిల్స్, మనలి, అత్తిపట్టు, ఎన్నూరు, మీంజూరు తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సమయంలోనే అనుమానాస్పదంగా బ్యాగుతో సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు శివగంగై జిల్లాకు చెందిన విష్ణుకుమార్(25), జగదీష్(28)గా గుర్తించారు. వీరు ఆంధ్ర నుంచి గంజాయిని అక్రమంగా తరలించి చైన్నె తదితర ప్రాంతాల్లోని యువకులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. వీరి నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మెగా వైద్య శిబిరానికి
విశేష స్పందన
కొరుక్కుపేట: తండయ్యాడు పేటలోని కెప్టెన్ మహల్‌లో టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ తమ వ్యవస్థాపకుల సంస్మరణార్థం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. నేత్ర, దంత, గుండె, ఫిజియోథెరపీ, మాతా శిశు సంరక్షణ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ప్రాథమిక పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందించారు. దృష్టి లోపం ఉన్న వాళ్లకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కాటరాక్ట్ ఉన్నవారికి అవసరమైన చికిత్స చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈసీజీ, ఎకో పరీక్షలు కూడా చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. సంస్థ నిర్వాహకులు వైద్యులను సముచిత రీతిని సత్కరించారు. మెగా శిబిరానికి టాబ్లెట్స్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందించింది. టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్‌కి చెందిన ఆపరేషన్స్ ప్రెసిడెంట్ కేవీ వాసుదేవ్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ ఎం.మాధవన్ ఉన్ని, డైరెక్టర్ వర్క్స్ ఎం.రవి, జనరల్ మేనేజర్ –పర్సనల్ వి.శేఖర్, జనరల్ మేనేజర్ టీజీ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 950 మంది ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
బ్యూటీ పార్లర్‌లో వ్యభిచారం
– మహిళ అరెస్ట్, ఇద్దరు
యువతులకు విడుదల
తిరువొత్తియూరు: చైన్నె కేకేనగర్, సత్య గార్డెన్ ప్రాంతంలో ఒక బ్యూటీ పార్లర్ నడుస్తోంది. ఇక్కడకు వచ్చే కస్టమర్లకు యువతులను చూపించి, మభ్యపెట్టి మసాజ్ పేరుతో వినూత్న పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ రత్నకుమార్ నేతత్వంలోని పోలీసులు మసాజ్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించబడింది. దీంతో వ్యభిచారంలో పాల్గొన్న యువతితోపాటు ఐటీ కంపెనీ ఉద్యోగిని హెచ్చరించి పంపిన పోలీసులు, వ్యభిచారంలో చిక్కుకున్న ఇద్దరు యువతులను రక్షించి మైలాపూర్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో చేర్చారు. బ్యూటీ పార్లర్ ఉద్యోగిని జెర్లిన్ ప్రియ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బ్యూటీ పార్లర్ యజమాని బిలాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నగలు దొంగిలించిన
ట్రాన్స్‌జెండర్
సేలం: ఈరోడ్ జిల్లాలోని పెరుందురై పక్కన ఉన్న కున్నతుర్ రోడ్డులోని కత్తలంగడు ప్రాంతంలోని పెరుందురై కోయంబత్తూర్ రోడ్డులో 33 ఏళ్ల వ్యక్తికి వాహన స్టిక్కర్ల దుకాణం ఉంది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళలు తరచుగా అతని దుకాణాన్ని సందర్శిస్తారు. దుకాణ యజమాని కూడా అప్పుడప్పుడు ట్రాన్స్‌జెండర్ మహిళలకు డబ్బు ఇచ్చేవాడు. శనివారం ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళలను ఆహ్వానించిన తర్వాత యజమాని రాత్రి పెరుందురై కోయంబత్తూర్ రోడ్డు, పెరియవిటుపాలయం సెక్షన్‌కు ఒంటరిగా వెళ్లాడు. యజమాని అక్కడి పొదల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలతో సరదాగా గడుపుతున్నాడు. తరువాత అతను దుకాణానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతను మెడలో ధరించిన 2 పౌండ్ల బంగారు నగలు మాయమైపోయాయని తెలుసుకుని అతను షాక్ అయ్యాడు. ట్రాన్స్‌జెండర్ మహిళలు దానిని తీసుకొని ఉంటారని భావించి, ఫోన్ చేసి వారితో మాట్లాడాడు. ఆ సమయంలో ట్రాన్స్‌సజెండర్ మహిళలు బంగారు నగలు ఎంత అని అడిగి ఫోన్ కట్ చేశారు. దీని తరువాత దుకాణ యజమాని ఈ సంఘటనపై పెరుందురై పోలీసులకు సమాచారం అందించాడు. పెరుందురై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

18 కిలోల గంజాయి స్వాధీనం