
కల నెరవేరింది!
సాక్షి, చైన్నె: చైన్నె రాయపురం మండలంలోని భోజరాజన్ నగర్‌లో కొత్తగా నిర్మించిన సబ్ వేను ప్రజాపయోగానికి తీసుకొచ్చారు. సోమవారం దీనిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఆ సబ్ వే మార్గంలో నడచుకుంటూ వాహనాలు సులభంగా వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర చైన్నెలోని కొరుక్కుపేట ప్రాంతంలోని భోజరాజన్ నగర్ పరిసరాలకు మూడు వైపులా రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమే. రైల్వే క్రాసింగ్‌ను దాటక తప్పదు. అత్యవసర సమయాలలో బయటకు రావాలంటే మార్గం అన్నది లేక తీవ్ర అవస్థలు పడుతుంటారు. ఈ రైల్వే క్రాసింగ్‌లలో గూడ్స్ రైళ్లు కొన్ని గంటల తరబడి ఆగితే చాలు, వాటి కింది భాగం నుంచి దూరి రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి. ఇటు వైపుగా బస్సులు,ఆటోలు కూడా వెళ్లవు. మూడు వైపులా ఉన్న రైల్వే క్రాసింగ్ నుంచి తమకు విముక్తి కలిగించే ప్రయాణ మార్గం సుగమం చేయాలని దీర్ఘ కాలంగా భోజరాజన్ నగర్ పరిసరాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
రూ. 30.13 కోట్లతో..
ఉత్తర చైన్నెలోని రాయపురంమండలం పరిధిలో ఉన్న ఈ భోజరాజన్ నగర్ పరిసరాలలోని సాధారణ ప్రజలతో సహా , వాహన దారులు దీర్ఘకాల ఎదురు చూస్తూ వచ్చిన సబ్ వే మార్గం ప్రస్తుతం నెరవేరింది. పరిమిత వాహన సబ్ వేగా , ప్రజా ఉపయోగ సబ్‌వేగా 2023లో చైన్నె కార్పొరేషన్ నిధి రూ. 30.13 కోట్లతో పనులు చేపట్టారు. సొరంగం పొడవు 207 మీటర్లు (రైల్వే విభాగం 37 మీటర్లు సహా), వెడల్పు 6 మీటర్లు. అలాగే, వర్షాకాలంలో, వర్షపు నీరు నీటిని సబ్ వే నుంచి బయటకు తరలించేందుకు వీలుగా 85 హెచ్‌పీ మోటారు పంపులు, జనరేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సబ్ వేద్వారా భోజరాజన్ నగర్, శ్రీనివాసన్ నగర్, మింట్ మోర్టన్ నగర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు లక్షన్నర మందికి ప్రయోజనకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. భోజరాజన్ నగర్ సబ్ వే ను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, ఇక్కడకు సమీపంలోని నిర్మించిన పిల్లల క్రీడా మైదానం, వాకింగ్ మార్గం తదితర పూర్తయిన నిర్మాణాలను కూడా ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. సబ్‌వేలో నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈకార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, పికే శేఖర్‌బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, ఎమ్మెల్యేలు ఆర్.మూర్తి, ఆర్.టి. శేఖర్, జె.జె. ఎబెనెజర్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ (పట్టణ ప్రణాళిక), ఇళయ అరుణ, రాయపురం జోనల్ కమిటీ చైర్మన్ పి. శ్రీరాములు, కార్పొరేటర్లు ఎస్. గీతా సురేష్, పి. వేలాంకన్ని పాల్గొన్నారు.

కల నెరవేరింది!