
సీఈసీకి స్టాలిన్ 7 ప్రశ్నలు
సాక్షి, చైన్నె: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం 7 ప్రశ్నలను తన సామాజిక మాధ్యమం పేజీ ద్వారా సంధించారు. ఓట్ల చోరీ అంశాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రశ్నలను లేవనెత్తారు. ఇంటింటికీ సర్వే నిర్వహిస్తామని చెబుతున్న ఈసీ తాను ప్రకటించిన తాజా జాబితాల్లో ఓటర్ల సంఖ్యలో అనూహ్య మార్పులు ఎందుకున్నాయని ప్రశ్నించారు. అలాగే యువ ఓటర్లను లెక్కించారా? అర్హత రోజున 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల సంఖ్య ఏ మేరకు ఉందో అన్న డేటాబేస్ ఉందా? అని రెండవ ప్రశ్న వేశారు. ఓటర్ల నమోదు నియమాలు 1960 కింద ఇవ్వబడిన నిబంధనలు దర్యాప్తు కాలపరిమితి, రెండు అప్పీల్ విధానాలు గురించి వివరిస్తూ బిహార్ ఎన్నికల అంశాన్నిగుర్తు చేస్తూ, అక్కడి సమస్యలు ఎలా పరిష్కరించనున్నారో? అని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో స్పెషల్ ఇంటెన్సివ్ కరెక్షన్ అమలు చేసినప్పుడు, ఎన్నికల సంఘం ఈ ఆచరణాత్మక సమస్యలను పరిష్కరిస్తుందా.? దీనిని పరిగణనలోకి తీసుకుంటారా? అని నాలుగో ప్రశ్న సంధించారు. 2025 మే 1న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆలస్యంగా ఓటర్ల పేర్లను తొలగించడానికి తాము జూలై 17న ఎన్నికల సంఘానికి అప్పీలు చేశామని గుర్తు చేస్తూ, ఇది ఎప్పుడు అమలు చేయబడుతుందని ప్రశ్నించారు. ఓటరు హక్కును నిర్ధారించే పత్రంగా ఆధార్‌ను అంగీకరించాలని, ఇందులో ఎన్నికల సంఘానికి ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం లక్ష్యం న్యాయమైన ఎన్నికలు అయితే, అది మరింత పారదర్శకంగా, ఓటర్లకు దగ్గరగా ఉంటుందా? అని ప్రశ్నలు సంధించారు.
వేలాంకన్నికి ప్రత్యేక రైలుసేవలు
సాక్షి, చైన్నె: పండుగ సమయంలో ప్రయాణీకులకు అదనపు సేవలు అందించే విధంగా రాష్ట్రంలోని వేలాంకన్నీ స్పెషల్స్ పేరిట ప్రత్యే రైళ్లను దక్షిణ రైల్వే పట్టాలెక్కించేందుకు సన్నద్ధమైంది.ఈ మేరకు కేరళ రాష్ట్రం ఎర్నాకులం జంక్షన్ – వేలాంకన్నీ మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును సోమవారం ప్రకటించారు. ఈ రైలు ఆగస్టు 27వ తేదీ, సెప్టెంబరు 3, 10 తేదీలలో రాత్రి 11.50 గంటలకు ఎర్నాటకులం జంక్షన్‌లో బయలుదేరి, మరుసటి రోజులలో సాయంత్రం 3.15 గంటలకు వేలాంకన్నీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 28, సెప్టెంబరు 4, 11 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు వేలాంకన్నిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ఎర్నాకులం జంక్షన్ చేరుకుంటుందని ప్రకటించారు.3 ఏసీ టూ టైర్ కోచ్, 8 ఏసీ త్రీ టైర్ కోచ్‌లులు,4 స్లీపర్ కోచ్‌లు, ఓ జనరల్ బోగీతో ఈరైలు పట్టాలెక్కనుంది. ఈ రైలు కేరళలోని కోట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలిక్కర, కయంకుళం, కరునాగపల్లి,శాస్తాం కోట, కొల్లం, కుందార, పునలూరు,తెన్మలై, తమిళనాడులోని సెంగోట్టై, తెన్‌కాశి, కడయనల్లూరు, శంకరన్‌కోయిల్ , రాజపాళయం, శివకాశి ,విరుదునగర్, అరుప్పుకోట్టై, మానా మదురై, కారైక్కుడి, అరంతాంగి, పేరావూరని, పట్టుకోట్టై, అదిరాం పట్నం, తిరుత్తురైపూండి, తిరువారూర్,నాగపట్నం మీదుగా వేలాంకన్నికి ప్రయాణించనుంది.
ఈసీ నోటీసులు
కొరుక్కుపేట: చైన్నెలోని మూడు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు జారీ చేసింది. వివరాలు..ఆవడి తాలూకాలోని అన్నా మక్కల్ ఇయకం, తిరువోత్తియూర్‌లోని సమత్వ మక్కల్ కజగం, మొగప్పేర్‌లోని తమిళర్ మున్నేట్ర కజగం అనే మూడు పార్టీలు గత 6 సంవత్సరాలుగా ఏ ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేదని నోటీసులో పేర్కొంది. ఈ మూడు పార్టీల ప్రతినిధులు 26వ తేదీన ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో స్వయంగా హాజరు కావాలని, వారి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు.
రజనీతో నైనార్ భేటీ
సాక్షి, చైన్నె : దక్షిణభారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ అయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందుగా రజనీ మద్దతు దిశగా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేయడం ఒకప్పడు పరిపాటిగా ఉండేదన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందుగానే, ఎన్నికల రోజు గానీ ఆయన ఇచ్చే సంకేతం కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. చివరకు తానే ఓ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, ఆ తర్వాత రజనీ యూటర్న్ తీసుకున్నారు. తదుపరి పరిణామాలతో తన దృష్టిని అంతా సినిమాల వైపుగా మళ్లించారు. అయితే ఇటీవల కాలంగా డీఎంకేతో సన్నిహితంగా ఉండే దిశగా రజనీ అడుగులు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో రజనీ కాంత్ సినీ రంగంలో అడుగు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని తరచూ ఆయన్ని పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు.. ఈ పరిస్థితులలో సోమవారం పోయేస్ గార్డెన్‌లో రజనీ కాంత్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ భేటీ అయ్యారు. అర్ధగంట పాటూ వీరి సమావేశం జరిగింది. ఈ భేటీ మర్యాద పూర్వకం అని నైనార్ స్పష్టం చేశారు. సినీ రంగంలో ఆయన రజనీ 50 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ,జ్ఞాపికను అందజేశానని తెలిపారు.