
ప్రజాస్వామ్యబద్ధంగా.. ముందడుగు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం సైనికులంతా ఆర్మీ క్రమ శిక్షణతో ప్రజా స్వామ్య బద్దంగా ముందడుగు వేద్దామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. మదురైలో జరగనున్న మహానాడుకు గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు రావద్దు అని విన్నవించారు. మధురై వేదికగా తమిళగ వెట్రి కళగం 2వ మహానాడుకు భారీ ఏర్పాట్లు ముగింపు దశలో ఉన్న విషయం తెలిసిందే. 21వ తేదీన జరగనున్న ఈ మహానాడును 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరపున సమర శంఖం పూరించే వేదికగా ఈ మహానాడును ఎంపిక చేశారు. ఈ బ్రహ్మాండ వేడుకకు మంగళ, బుధవారం మాత్రమే సమయం ఉంది. గురువారం జరగనున్న ఈ వేడుకకు పెద్ద ఎత్తున జన సమీకరణ కసరత్తు జరుగుతున్నాయి. విజయ్ వెన్నంటి ఉన్న యువ సమూహం మదురైకు కదిలేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో మహానాడుకు సంబంధించి కేడర్‌కు విజయ్ సోమవారం లేఖ రాశారు. మహానాడుకు సంబంధించి ఇది రెండవ లేఖ అని పేర్కొంటూ, తమిళ ప్రజల ప్రేమ, అభిమానులు, గొప్ప ఆదరణతో ఎన్నికల రాజకీయ కదనరంగంలో మనం అంటే ఏమిటో నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు. అటు పోట్లను ఎదుర్కొని ముందుకు సాగామని గుర్తు చేస్తూ, మరికొన్ని నెలలు ఎన్నికల సమరం జరగబోతోందన్నారు. 1967, 1977 ఎన్నికల ఫలితాల చరిత్రను మళ్లీ చూసే దిశగా 2026 ఎన్నికలు కాబోతున్నాయన్నారు. తమిళనాడు ప్రజలు ఎంతో అభిమానించే ఈ విజయ్ గురించి అందరికీ బాగా తెలుసునని పేర్కొంటూ, నిజాయితీగా, నాగరికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తన రాజకీయ వ్యవహార శైలి ఉంటుందని వివరించారు. ఆ దిశగా తమిళగ వెట్రి కళగం సైనికులు ఆర్మీలో ఏ విధంగా క్రమ శిక్షణతో ఉంటారో,అ దే తరహాలో ముందడుగు వేద్దామని పిలుపు నిచ్చారు. మదురైలో జరగనున్న మహానాడును జయప్రదం చేసుకుంద్దామని పిలుపునిస్తూ, ఈ మహానాడుకు దయ చేసి గర్భిణి మహిళలు, చంటి బిడ్దల తల్లులు, వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులను తీసుకు రావద్దని కోరారు. వారికి తాను ఒకే విజ్ఞప్తి చేస్తున్నానని, తన మీద అభిమానం ఉంటే, ఇంటి వద్ద నుంచి ప్రత్యక్షప్రసార ఏర్పాట్ల ద్వారా మహానాడును వీక్షించాలని విన్నవించారు. అందరి భద్రత, ఆరోగ్య క్షేమం తనకు ముఖ్యం అని వివరిస్తూ, మహానాడు ముగిసినానంతరం కేడర్ అంతా క్రమ శిక్షణతో స్వస్థలాలకు బయలు దేరి వెళ్లాలని, ప్రజల ప్రయోజనాలను కాంక్షించే విధంగా కేడర్ అడుగులు ఉండాలే గానీ, వారికి ఆటంకం కలిగించే పరిణామాలు అన్నది ఉండ కూడదని, ఇందుకు చోటు లేదని స్పష్టం చేశారు.