బంగారం రుణాలకు పెరగనున్న డిమాండ్
సాక్షి, చైన్నె: బంగారం రుణాలకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని ఇండెల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమేష్ మోహన్ తెలిపారు. గురువారం స్థానికంగా ఎఫ్‌వై 25లో చెల్లింపులో సాధించిన వార్షిక వృద్ధి వివరాలను ఆయన ప్రకటించారు. ఇండెల్ మనీ 69 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలోని ఏయూఎం 52 శాతం పెరిగిందన్నారు. ఇది రూ.2,400 కోట్లకు చేరినట్టు పేర్కొంటూ, 2026లో 10 వేలకోట్ల చెల్లింపులను సాధించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాబోయే త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నందున, ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశం ఉన్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గురించి కూడా ఆశాజనకంగా ఉన్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో దేశీయ వినియోగం, బంగారు రుణ డిమాండ్ కూడా పెరుగుతుందన్నారు.
తిరుత్తణిలో మోస్తరు వర్షం
తిరుత్తణి: పట్టణంలో గురువారం సాయంత్రం మోస్తరుగా వర్షం కురిసింది. తరచూ వర్షం కురవడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గింది. కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉంటూ చల్లటి గాలి వీస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అర్ధ గంటపాటు మోస్తరుగా వాన కురిసింది. దీంతో ప్రయాణికులు తడుస్తూ వెళ్లారు. వరుణుడి కరుణతో వేడి తగ్గి చల్లటి గాలి వీయడంతో ప్రజలు ఆనందం చెందారు.


