చిదంబరంలో ఆరుద్ర దర్శన మహోత్సవం
సాక్షి, చైన్నె: చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో ఆరుద్ర దర్శన మహోత్సవాలకు గురువారం శ్రీకారంచుట్టారు. వారం రోజులకుపైగా జరిగి ఉత్సవాలకు ధ్వజారోహణం వేకువ జామున జరిగింది. భక్తుల శివనామస్మరణ నడుమ జనవరి 2న రథోత్సవం, 3వ తేదీన ఉత్సవాల ముఖ్య ఘట్టమైన ఆరుద్ర దర్శన మహోత్సవం నిర్వహించనున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నటరాజ స్వామి ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే. పంచభూతాలలో ఆకాశ స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మార్గళి ( మార్గశిరా)మాసంలో ఆరుద్ర దర్శనం మహోత్సవ వేడుకలు జరుగుతాయి.
ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఉత్సవాలకు శ్రీకారంచుట్టే విధంగా గురువారం ఉదయాన్నే ఆలయంలోని నటరాజ స్వామి సన్నిధిలో విశిష్ట పూజలు, అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. ఆలయం ఆవరణలో ధ్వజ స్తంభానికి అభిషేకాది పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణ మధ్య ధ్వజారోహణం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. శనివారం ఉదయం బంగారు సూర్య ప్రభా వాహన సేవ ఉంటుంది. ఆదివారం వెండి భూత వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టంగా రథోత్సవాన్ని జనవరి 2 తేదీన నిర్వహించనున్నారు. శివగామ సుందరీ సమేత నటరాజ స్వామివారు ఓ రథంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇస్తారు. ముందుగా వినాయకుడు మరోరథంపై, వెనుక సుబ్రమణ్య స్వామి, అంబాల్,చండికేశ్వరర్ స్వామి వారు ఇతర రథాలపై అనుకరించడం జరుగుతుంది. ఈ రథోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు వెయ్యికాళ్ల మండపంలో ఏక కాల లక్షార్చన సేవ జరగనుంది. మరుసటి రోజు జనవరి 3వ తేదీ అత్యంత ముఖ్య ఘట్టం ఆరుద్రదర్శన సేవ ఉంటుంది. ఈ ఉత్సవాలకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి రానుండడంతో చిదంబరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
నెల్లయ్యప్పర్ సన్నిఽధిలో..
తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో సైతం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నెల్లయ్యప్పర్, గాంధి మది అమ్మన్ పేరిట శివ, పార్వతిలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ జరిగే ఆరుద్ర దర్శన ఉత్సవాన్ని తిలకించేందుకు దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త జనం తరలి రానున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు వేకువ జామున ధ్వజారోహణం జరిగింది.
చిదంబరంలో ఆరుద్ర దర్శన మహోత్సవం


