నేడు ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్‌పై సెమినార్
– మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై
కొరుక్కుపేట: దేశాభివృద్ధికే ఒకే దేశం, ఒకే ఎన్నిక (వన్ నేషన్, వన్ ఎలక్షన్) అని తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని కమలాలయం వేదికగా విలేకరుల సమావేశంలో ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్ తమిళనాడు కన్వీనర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు. చైన్నెలోని తిరువాన్మయూర్‌లోని శ్రీరామచంద్ర కన్వెన్షన్ సెంటర్ వేదికగా సోమవారం ఉదయం 10 గంటలకు ఒకే దేశం, ఒకే ఎన్నిక –దేశవ్యాప్త అవగాహన సెమినార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించే రీతిలో ఈ సెమినార్ జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు తరలిరావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. భావి తరాలకు మంచి దేశాన్నందించాలంటే ఒన్ నేషన్..ఒన్‌న్ ఎలక్షన్‌న్ చాలా అవసరమని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.ఈ సెమినార్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్టు తెలిపారు. సెమినార్ పూర్తిగా పార్టీలకతీతంగా జరుగుతుందని, ఈ సెమినార్ బీజేపీకి సంబంధం లేదని అన్నారు. సెమినార్ కో–కన్వీనర్లు నారాయణ తిరుపతి, అర్జున్‌మూర్తి, బీజేపీ అధికార మీడియా ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు పాల్గొన్నారు.


