ఆవిష్కరణలకు వేదికగా రెటీకాన్ 2025
సాక్షి, చైన్నె: కంటి సంబంధిత శస్త్ర చికిత్సల్లో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికగా రెటీకాన్–2025 నిలిచింది. ఆదివారం చైన్నెలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు 1,500 మంది వైద్య నిపుణులు, మరో 30 మంది అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. విట్రియోరెటినల్ సంరక్షణలో తాజా పురోగతులపై ఈ సదస్సులో చర్చించారు. వెట్ ల్యాబ్ ఆచరణాత్మక కోర్సు గ్లూడ్ ఐఓఎల్, ఎఫ్‌టీ, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ల వంటి అత్యాధునిక పద్ధతుల్లో ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ఆవిష్కరణలు జరిగాయి. పెరుగుతున్న సమస్యలతో కంటి సంరక్షణలో మరింత పురోగతి దిశగా అత్యాధునిక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే విధంగా ‘రెటీనాలో పురోగతి’ అనే అంశంపై సుదీర్ఘ చర్చ సైతం సదస్సులో జరిగింది. విట్రోరెటినల్ నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, జనరల్ ఆప్తాల్మజిస్టులను ఈ సదస్సు ఒకచోట చేర్చింది. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్, చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ సమక్షంలో ఈ సదస్సును ఉత్తర చైన్నె ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి, ఆల్ ఇండియా ఆప్తాల్మాజికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ రాజన్ ప్రారంభించారు. విజయవంతంగా 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ వార్షిక కార్యక్రమాన్ని విజయోత్సవం తరహాలో నిర్వహించారు. విట్రియోరెటినల్ రుగ్మతలను నిర్ధారించడం, నిర్వహించడంపై తాజా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, సాంకేతికతలపై, నవీకరణలను అందించడం లక్ష్యంగా ఈ సదస్సులో వక్తలు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ అధ్యాపకులలో డాక్టర్ అనిరుద్ధ అగర్వాల్, డాక్టర్ జెస్సీ సెంగిల్లో, డాక్టర్ కెల్విన్ టియో తమ అనుభవాలను పంచుకున్నారు.
భావితరానికి తోడ్పాటు..
ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ మాట్లాడుతూ.. రెటికాన్ సదస్సును ప్రతి సంవత్సరం అంకిత భావంతో నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో రెటీనా విభాగం క్లినికల్ లీడ్ హెడ్ డాక్టర్ మనోజ్, ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్, డాక్టర్ పర్వీన్ సేన్, డాక్టర్ పద్మ ప్రీత.ఎన్, డాక్టర్ త్రివేణి.వి పాల్గొన్నారు.


