‘నమ్మ చైన్నె.. నమ్మ మార్కెట్’ సేవల విస్తరణ
సాక్షి, చైన్నె: ప్రజలకు చౌక ధరలకే అన్ని రకాల కూరగాయాలు, పండ్లు, ఫలాలను అందించేందుకు వీలుగా నమ్మ చైన్నె..నమ్మ మార్కెట్ సేవలను విస్తరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ఏడాది సెమ్మోళి పార్కులతో ‘నమ్మ చైన్నె..నమ్మ మార్కెట్’ పేరిట కూరగాయలు, పండ్ల విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈ మార్కెట్‌లో సంప్రదాయ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, విలువ ఆధారిత వివిధ ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు ఇక్కడ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వివిధ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పండించే స్థానిక కూరగాయలను చౌక ధరకు ఇక్కడ విక్రయాలు జరుగుతుండడంతో ఇక ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వివిధ వస్తువులను చైన్నె నగర వాసులకు చౌక ధరకే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దిండుక్కల్, కొడైకెనాల్, కోయంబత్తూరు, కన్యాకుమారి, సేలం, తెన్‌కాశి, తిరుపూర్, నామక్కల్, నీలగిరిలలో లభించే స్థానికంగా ప్రసిద్ధి చెందిన వస్తువులు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు సైతం ఈ మార్కెట్‌లో కొలువుదీర్చనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఈ మార్కెట్ సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు.


