ఇండో–యూఎస్ విద్యా సహకారం బలోపేతం
కొరుక్కుపేట: ఇండో–యూఎస్ విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి క్యాంపస్ యూఎస్‌ఏ, జడ్సన్ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థులకు విద్యా అవకాశాలను కల్పిస్తుందని క్యాంపస్ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడు హరీష్ అనంతపద్మనాభన్ తెలిపారు. ఈ సందర్భంగా చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో జడ్సన్ విశ్వవిద్యాలయంతో కలి ఇండో–యూఎస్ విద్యా రంగంలో అగ్రగామి సంస్థ అయిన క్యాంపస్ యూఎస్‌ఏ విద్యా భాగస్వామ్యం, పరిశోధన సహకారం విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను పెంపొందించడానికి చైన్నెలోని ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నట్టు తెలిపారు. భారతదేశం–అమెరికా మధ్య డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్ షిప్, ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్‌లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో చైన్నె టి.నగర్‌లోని అకార్డ్ మెట్రోపాలిటన్‌లో మే 3వ తేదీన స్టడీ ఇన్ ది యూఎస్‌ఏ ఈవెంట్ జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జడ్సన్ విశ్వవిద్యాలయ అధికారులతో నేరుగా సంభాషించవచ్చునని, ఉన్నత విద్యా అవకాశాలను అన్వేషించవచ్చునన్నారు. స్కాలర్‌షిప్ ఎంపికలతో స్పాట్ అడ్మిషన్లను కూడా పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్సన్ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిక్కీ ఫెన్నర్, కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల డైరెక్టర్ డాక్టర్ డానా ఓనయేమి పాల్గొన్నారు.


