ఘనంగా కుట్రంతవీర్ ఆడియోలాంచ్
తమిళసినిమా: కర్ణాటకకు చెందిన పాండురంగన్ శ్రీ సాయి సైంధవి క్రియేషన్ పతాకంపై నిర్మించిన తమిళ చిత్రం కుట్రం తవీర్. గజేంద్ర దర్శకత్వం వమించిన ఇందులో రిషీ రిత్విక్, ఆరాధ్య జంటగా నటించారు. నిర్మాత పాండురంగన్ కీలక పాత్రను పోషించడంతో పాటూ ఒక పాటను కూడా రాయడం విశేషం. కాగా ఈ చిత్రంలో సవరణన్, ఆనంద్‌బాబు, వినోదిని, చెండ్రాయిన్, జార్జ్ విజయ్, సాయిదీనా, మీసై రాజేంద్రన్, మాజీ సైనికుడు కామరాజ్‌లతో పాటు బాలనటి సాయి సైంధవి ముఖ్య పాత్రలు పోషించారు. రోవిన్ భాస్కర్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించిన కుట్రం తవీర్ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వమించారు. ఇందులో సీనియర్ దర్శక నిర్మాత, సంగీత దర్శకుడు గంగైఅమరన్, దర్శకుడు పేరరసు, పవిత్రన్, అన్నాడీఎంకే నేత ఈ. పుగళేంది, జయప్రకాశ్ స్వామీజీ, దర్శకుడు రాజ్‌కుమార్, అరవిందరాజ్, వ్యాపారవేత్త ప్రకాశ్ పళని మొదలగు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత పాండురంగన్ మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన తాను తమిళ చిత్రాన్ని నిర్మించానన్నారు. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం బెంగళూరులోనే నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం ద్వారా 2 వేల మందికి పని కల్పించానని ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తే మళ్లీ చిత్రం చేసి పలు కుటుంబాలకు పని కల్పిస్తానని చెప్పారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఏ రంగంలో కనిపించని ఐక్యత సినిమా రంగంలో కనిపిస్తుందన్నారు. అందుకు ఈ వేదికనే చిన్న ఉదాహరణ అనీ, ఇక్కడ రాజకీయవాది, ఆధ్యాత్మికవాది, వ్యాపారవేత్త ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారన్నారు. ఈచిత్రం పేరు కుట్రం తవీర్ అని, అంటే నేరాలకు దూరంగా ఉండాలని అర్థం అన్నారు. చిత్రానికి శ్రీకాంత్ దేవా మంచి సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. పాటలను చూశామని, ఒక పాటలో హీరోయిన్ చాలా బాగా నటించారని, హీరో మాత్రం హీరోయిన్ హిప్ చూడటం వల్ల లిప్ వదిలేశారని సరదాగా అన్నారు. ఈ చిత్రం హిట్ అయితే నిర్మాత మరో చిత్రం చేస్తానని చెప్పారని, కుట్రం తవీర్ చిత్రానికి మంచి ఆదరణను అందించాలని పేర్కొన్నారు.


