పీఎంకే బలోపేతానికి కృషి చేయాలి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పీఎంకే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని తమిళనాడు వన్నియర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుల్‌మొయి అన్నారు. మే 11వ తేదీన జరగనున్న మహానాడుపై వేలూరు ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలతో సమీక్షా సమావేశానికి పీఎంకే జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడుకు వేలూరు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం వెయ్యి బస్సుల్లో 50 వేల మందికి పైగా కార్యకర్తలు తరలిరావాలన్నారు. యువత అఽధిక సంఖ్యలో కలుసుకోవాలన్నారు. పీఎంకే పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులకు వెళ్లవచ్చునని పార్టీలో కష్టపడే వారికి తప్పక మంచి కాలం వస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ యువతకు మహానాడు గురించి అవగాహన కల్పించి అందులో కలుసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో పీఎంకే మాజీ కేంద్ర మంత్రి ఎన్‌టీ షణ్ముగం, వన్నియర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యమూర్తి, తూర్పు డివిజన్ కార్యదర్శి బాబు, జిల్లా అధ్యక్షుడు తవమని, మాజీ ఎమ్మెల్యే ఇళవయగన్, వేలూరు జిల్లా యువజన విభాగం కార్యదర్శి జగన్, గోపి, మురుగన్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


