రేషన్ డీలర్ల ధర్నా
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ రేషన్ విక్రయదారులు వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దీనికి తమిళనాడు ప్రభుత్వ రేషన్ విక్రయ దారుల సంఘం జిల్లా అధ్యక్షులు జయవేలు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి సెల్వం ముఖ్య అతిథిగా హాజరై ధర్నాను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో కుటుంబ రేషన్ కార్డు దారుడు తప్పనిసరిగా వేలి ముద్రలు పెట్టాలని నిబంధనలు పెట్టడం వల్ల కొన్ని సమయాల్లో ఆన్‌లైన్ పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గోడౌన్ నుంచి వచ్చే నిత్యావసర సరుకులు సరైన తూకంతో రావాలని అన్ని బస్తాలు తక్కువ బరువుతో రావడంతో కార్డు దారులకు నిత్యసర వస్తువులు అందజేయలేక పోతున్నామన్నారు. విక్రయదారులకు సీనియారిటీ ప్రకారం విద్యా అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని, నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయాలని, అధికారులు వారంలో మూడు రోజుల పాటూ తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడాన్ని మానుకోవాలని తదితర మొత్తం 30 డిమాండ్‌లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇప్పటికే తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లినా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతోనే ధర్నా నిర్వహిస్తున్నామని ఇప్పటికై నా స్పందించకుంటే పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో సేల్స్‌మన్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


