గిరివలయం రోడ్డులో ఆక్రమణలు తొలగించాలి
వేలూరు: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయానికి చిత్ర పౌర్ణమికి అధిక సంఖ్యలో భక్తులు గిరివలయం వస్తారని ఆలయ నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమి మే మాసం 11వ తేదీన రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై 12వ తేదీన రాత్రి 10.48 గంటలకు ముగుస్తుంది. ఈ పౌర్ణమి రోజున మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకొని గిరివలయం వెల్లనున్నారు. దీంతో భక్తుల కనీస వసతుల ఏర్పాట్లుపై కలెక్టర్ థర్పగరాజ్ మంగళవారం ఉదయం ఆలయ మాడ వీధులు, గిరివలయం రోడ్డు, భక్తులు దర్శనార్థం వెళ్లే దారి, భక్తులకు అవసరమైన తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కనీస వసతులను తనిఖీ చేశారు. అనంతరం ఆటో స్టాండ్‌కు వెళ్లి భక్తులను ఆలయానికి తీసుకొచ్చే సమయంలో అతి జాగ్రత్త వహించాలని ఆదేశించారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్షించారు. ఆలయ మాడ వీధుల నుంచి గిరివలయం రోడ్డు వరకు అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గిరివలయం రోడ్డులో అధికంగా ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సుదాకర్, డీఆర్‌ఓ రామ్ ప్రదీభన్, అదనపు ఎస్పీ సతీష్‌కుమార్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఇంజినీర్ అన్బరసన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


